కొన్ని షరతులపై మాత్రమే టికెట్‌ ధరలు పెంచుతామని చెప్పాం: మంత్రి కోమటిరెడ్డి

హైదరాబాద్‌ (జనంసాక్షి):టికెట్‌ ధరల పెంపు విషయంలో అంతా కూర్చొని మాట్లాడుకున్న తర్వాతే నిర్ణయం తీసుకున్నామని తెలంగాణ సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సోమవారం సినిమా టికెట్‌ ధరల పెంపు అంశంపై మరోసారి స్పందించారు.‘‘సంధ్య థియేటర్‌ ఘటన తర్వాత టికెట్‌ ధరల పెంపునకు అనుమతి ఇవ్వబోమని నేను, ముఖ్యమంత్రిగారు ప్రకటించిన మాట వాస్తవమే. ఆ తర్వాత మేమంతా కూర్చొని మాట్లాడుకుని మా నిర్ణయాన్ని సవరించాం. ఒకవేళ టికెట్‌ ధరలు పెంచాల్సి వస్తే 20శాతం సినీ కార్మికుల సంక్షేమానికి ఇవ్వాలని షరతు పెట్టాం. అందుకు అనుగుణంగానే కొన్ని సినిమాలకు ఇచ్చాం. దీనిపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ సమయంలో నేను హైదరాబాద్‌లో లేను. మున్సిపల్‌ ఎన్నికల దృష్ట్యా నల్గొండ, భువనగిరి జిల్లాలను పర్యవేక్షిస్తున్నా. అప్పుడే జీవో ఇచ్చారు. మా ముఖ్యమంత్రి ఏ శాఖల విషయంలోనూ జోక్యం చేసుకోరు. అందరినీ కలుపుకొని వెళ్తారు’’ అని అన్నారు.ఇటీవల మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. గతంలోనూ, ప్రస్తుతం సినిమా టికెట్‌ ధరలు పెంచేందుకు తాను ఎప్పుడూ అనుమతి ఇవ్వలేదని అన్నారు. సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం మానేశానని తెలిపారు. సంధ్య థియేటర్‌ ఘటన తర్వాత బెనిఫిట్‌ షోలు, సినిమా టికెట్‌ ధరలను పెంచమని తన వద్దకు రావొద్దని చెబుతూనే ఉన్నానన్నారు. రేట్లు, బెనిఫిట్‌ షోలకు సంబంధించి తనకు ఎలాంటి సంబంధం లేదన్న ఆయన.. టికెట్‌ ధరల పెంపు గురించి వస్తున్న జీవోల విషయం తనకు తెలియదన్నారు.