కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం

ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి కృష్ణారావు
శ్రీకాకుళం, జూన్‌ 27 : ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తామని ఆల్‌ఇండియా ట్రేడ్‌ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా ఇన్‌ఛార్జి కిర్ల కృష్ణారావు చెప్పారు. శ్రీకాకుళం పట్టణంలోని స్థానిక రామలక్ష్మణ కూడలి వద్ద గల క్రాంతిభవనంలో జరిగిన కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఇష్టారాజ్యంగా పెంచుతున్న పెట్రోల్‌, గ్యాస్‌ ఇతర నిత్యావసరాల ధరలతో కార్మిక, ఉద్యోగుల జీవన ప్రమాణాలు పడిపోతున్నాయన్నారు. కార్మిక చట్టాలను రూపొందించినా అవి అమలుకు నోచుకోక పోవడంతో నిర్వీర్యంగా మారుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా అసంఘటిత రంగంలో 42 కోట్ల మంది కార్మికులున్నారని ఆయన చెప్పారు. వీరి సంక్షేమానికి మాత్రం ఏడాదికి కేవలం వెయ్యి కోట్లను మాత్రమే కేటాయిస్తోందన్నారు. ఈ నిధిని రూ. 30వేల కోట్లకు పెంచాలంటూ డిమాండ్‌ చేస్తున్నామన్నారు. ఇటీవల విశాఖ స్టీల్‌ప్లాంటులో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో కార్మికులు, అధికారులు సైతర ప్రాణాలు కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ప్రైవేటీకరణ వల్లే ఈ దుర్ఘటన చోటు చేసుకుందని ఆయన ఆరోపించారు. కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా వచ్చే నెల 10వ తేదీన రాష్ట్ర రాజధానిని ముట్టడిస్తామని ఆయన వివరించారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు కీర్తి సూర్యనారాయణ, కార్యదర్శి గోవిందరావు, ప్రతినిధులు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.