కిరణ్‌కుమార్‌రెడ్డి చీకటి పాలనకు స్వస్తి పలకాలి..
ఏలూరు, జూలై 17: విద్యుత్ సరఫరాలో జరుగుతున్న కోతలపై పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది. ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పిలుపు మేరకు జిల్లావ్యాప్తంగా పార్టీ శ్రేణులు మంగళవారంనాడు విద్యుత్ సబ్‌స్టేషన్లు ముట్టడించాయి. జిల్లా కేంద్రమైన ఏలూరుతో సహా అన్ని నియోజకవర్గా కేంద్రాల్లో విద్యుత్ సబ్‌స్టేషన్ల వద్ద ఆ పార్టీ జిల్లా కన్వీనర్ కొయ్యే మోషన్‌రాజు సూచనల మేరకు పార్టీ కార్యకర్తలు, నాయకులు బైఠాయించి నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి విద్యుత్ రంగాన్ని భ్రష్టు పట్టించారని, ఆయన చీకటి పాలనలో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని ఇలాంటి ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడాలని జిల్లా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఊదరగొండి చంద్రమౌళి పిలుపునిచ్చారు. విద్యుత్ కోతలపై నిరసనగా దెందులూరు విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ముట్టడించిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన సబ్‌స్టేషన్ వద్ద మంగళవారం ధర్నా చేశారు. టిడిపిలు నిత్యం కుమ్మక్కు రాజకీయాలు నడుపుతూ జన నేత జగన్మోహన్‌రెడ్డిపై కుట్రలు ఎలా చేయాలో అన్న విషయంపైనే దృష్టి పెట్టడం తప్ప ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలేసిన కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వానికి పరిపాలించే నైతిక హక్కు లేదన్నారు. జిల్లా మీడియా కో-ఆర్డినేటర్ బివి రమణ మాట్లాడుతూ సంక్షేమ పథకాలపై మహానేత వైఎస్‌ఆర్ ముద్రను చెరిపివేయాలన్న సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, మంత్రుల ఆలోచనలు వారి అవివేకానికి నిదర్శనమన్నారు. వైఎస్ ఆశయాల బాటలో నడుస్తున్న జగన్మోహన్‌రెడ్డి నాయకత్వంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందిబి మోగించడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో దెందులూరు మండల పార్టీ కన్వీనర్ కేతినేని రాజా, పెదవేగి మండల కన్వీనర్ శంకరగౌడ్ ఏలూరు మండల కన్వీనర్ భూషణరావు తదితరులు పాల్గొన్నారు.