కూలిన మహోన్నత శిఖరం
నల్లవాళ్ల పౌరుషాన్ని రగిలించి.. తెల్లవాళ్ల గుండెళ్లో నిదురించిన బాక్సర్ దిగ్గజం
మహ్మద్ అలీ ఇకలేరు
ఫొయినిక్స్(యూఎస్‌ఏ),జూన్ 4(జనంసాక్షి):బాక్సింగ్ దిగ్గజం మహ్మద్ అలీ (74) కన్ను మూశారు. తీవ్ర అస్వస్థతతో ఫొయినిక్స్ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. పార్కిన్సన్ వ్యాధి కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న అలీ కొన్నేళ్లుగా చికిత్స చేయించుకుంటున్నారు. ఆయనకు 1980లోనే ఈ వ్యాధి సోకింది. మూడు దశాబ్దాలుగా పార్కిన్సన్ వ్యాధితో పోరాడుతున్న అలీ కన్నుమూసినట్లు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు.’ది గ్రేటెస్ట్’గా పేరు తెచ్చుకున్న మహ్మద్ అలీ అమెరికాలోని కెంటుస్కీలో లూయీస్‌విల్లేలో 1942 జనవరి 17న జన్మించారు. అలీ అసలు పేరు కాషియస్ క్లే. 12వ ఏట బాక్సింగ్‌లో శిక్షణ ప్రారంభించిన అలీ 22ఏళ్లకే ప్రపంచ హెవీవెయిట్ ఛాంపియన్‌షిప్ టైటిల్ సాధించారు. 1964లో దిగ్గజ బాక్సర్ సోనీలిస్టన్‌పై గెలుపుతో ప్రపంచ ఛాంపియన్‌గా మహ్మద్ అలీ నిలిచారు. తర్వాత ఆయన ఇస్లాం మతం స్వీకరించి మహ్మద్ అలీగా పేరు మార్చుకున్నారు. 1967లోనూ హెవీవెయిట్ టైటిల్ సొంతం చేసుకున్నారు. 1964, 1974, 1978ల్లో ప్రపంచ హెవీవెయిట్ ఛాంపియన్‌షిప్ విజేతగా నిలిచారు.గొప్ప ఛాంపియన్‌గా పేరొందినప్పటికీ ఆయన కెరీర్ వివాదాస్పదంగా కొనసాగింది. 1967లో అమెరికా-వియత్నాం యుద్ధ సమయంలో అలీని అమెరికా ఆర్మీలో పనిచేయడానికి ఎంపిక చేసుకున్నారు. కానీ అలీ ఆర్మీ ఆఫర్‌ను తిరస్కరించారు. శక్తివంతమైన అమెరికా కోసం పేద ప్రజలపై పోరాడనని తేల్చి చెప్పారు. మరికొన్ని వివాదాలతో ఆయనకు బాక్సింగ్ టైటిల్ వదులుకున్నారు. ఐదేళ్ల జైలుశిక్ష కూడా అనుభవించారు. న్యాయ పోరాటం తర్వాత అలీకి తిరిగి బాక్సింగ్ పోటీల్లో పాల్గొనేందుకు అనుమతి లభించడంతో మళ్లీ తన బాక్సింగ్ కెరీర్ ప్రారంభించారు. 1974లో ఫ్రేజియర్‌పై గెలుపొంది ఛాంపియన్‌షిప్ సొంతం చేసుకున్నారు. ప్రపంచ ఛాంపియన్లతో పాటు మరెన్నో పోటీల్లో అలీ విజయాలు సొంతం చేసుకున్నారు. అలీ తన బాక్సింగ్ కెరీర్‌లో ఐదుసార్లు మాత్రమే ఓటమి చవి చూశారు.అలీకి నాలుగు పెళ్లిళ్లు అయ్యాయి. ప్రసుతమున్న ఆయన భార్య లోన్నీ. ఆయనకు తొమ్మిది మంది సంతానం ఉన్నారు. ఏడుగురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు. అలీ 1981లో రిటైర్మెంట్ ప్రకటించారు. ఆ సమయంలోనే పార్కిన్సన్ వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి. 1984లో అధికారికంగా నయంకాని పార్కిన్సన్ వ్యాధిని గుర్తించారు. 2005లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ మహ్మద్ అలీని అత్యున్నత అమెరికా పౌరపురస్కారం ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్‌తో సత్కరించారు. తన జీవితగాథపై పలు పుస్తకాలు కూడా రచించారు. ది గ్రేటెస్ట్, మై ఓన్ స్టోరీ, ది సోల్ ఆఫ్ ఎ బట్టర్‌ప్లె పుస్తకాలను అలీ రచించారు.