కృష్ణాబోర్డుకు నీటి పంపిణీ అధికారం లేదు

C

– కేంద్రమంత్రి ఉమాభారతికి హరీశ్‌ బృందం ఫిర్యాదు

న్యూఢిల్లీ,జూన్‌ 6(జనంసాక్షి): కృష్ణా నదీ బోర్డుకు నీటి పంపిణీ అధికారం లేదని.. నీటిని రెగ్యులేట్‌ చేసే అధికారం మాత్రమే ఉందని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు.ఇవాళ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతితో హరీశ్‌రావు నేతృత్వంలో టీఆర్‌ఎస్‌ ఎంపీల బృందం సమావేశమైంది. అనంతరం మంత్రి హరీశ్‌రావు విూడియాతో మాట్లాడుతూ నీటి కేటాయింపులపై కృష్ణా బోర్డు ముసాయిదా నోటిఫికేషన్‌ పంపించింది. ముసాయిదా నోటిఫికేషన్‌ చట్ట వ్యతిరేకమని కేంద్రమంత్రికి తెలిపామన్నారు.ఉమ్మడి రాష్ట్రంలో 800టీఎంసీల నీటిని కేటాయించడం జరిగింది. సీమాంధ్రకు 512, తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయించారు. నీటి కేటాయింపులపై బ్రిజేశ్‌కుమార్‌ ట్రైబ్యునల్‌లో వాదనలు జరుగుతున్నాయి. ఈ సమయంలో కృష్ణా బోర్డు నీటి కేటాయింపుల పరిధిపై నోటిఫికేషన్‌ను ఇవ్వడం సరికాదన్నారు.తెలంగాణకు వ్యతిరేకంగా తీసుకున్న కృష్ణా బోర్డు నిర్ణయాలను వెంటనే నిలిపేయాలని కోరారు. ఏపీ సర్కారు దురహంకారంగా వ్యవహరిస్తున్న వైనాన్ని కూడా కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ ఉద్యమం సాగిందే నీళ్లు, నిధులు, నియామకాల్లో వివక్షకు వ్యతిరేకంగా అని వివరించారు. అలాంటిది రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడ్డాక నీటి వాటా తేలకుండా.. దౌర్జన్యంగా ప్రాజెక్టులను తమ అధీనంలోకి తీసుకోవాలని కృష్ణా బోర్డు యత్నించడం కుట్రపూరితమేనని స్పష్టం చేశారు.దీనిపై స్పందించిన కేంద్రమంత్రి ఉమాభారతి వెంటనే జలవనరుల శాఖ అధికారులతో మాట్లాడారు. ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. జలవనరుల శాఖ అధికారులతో భేటీ కావాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మకు సూచించారు.కేంద్రమంత్రి ఉమాభారతితో చర్చలు సంతృప్తికరంగా సాగాయని మంత్రి హరీష్‌ రావు తెలిపారు. తెలంగాణకు న్యాయంగా రావాల్సిన నీటి వాటాను సాధించేందుకు ఎలాంటి పోరాటానికైనా సిద్ధమేనన్నారు. కృష్ణా రివర్‌ బోర్డు రాసిన డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ ను నిలుపుదల చేయాల్సిందిగా కేంద్ర మంత్రి ఉమా భారతిని కోరామన్నారు. కృష్ణా రివర్‌ మేనేజ్‌ మెంట్‌ బోర్డుకు నీటి కేటాయింపులు చేసే అధికారం లేదని, నీటి కేటాయింపులు ట్రిబ్యునళ్ల ద్వారానే జరపాల్సి ఉంటుందని మంత్రి హరీష్‌ రావు చెప్పారు. కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి శ్రీవాత్సవ్‌ ని కలిసి రివర్‌ బోర్డు పక్షపాత వైఖరిని వివరించామని చెప్పారు. విభజన చట్టాన్ని ఉల్లంఘించే అధికారం ఎవరికీ లేదని, రేపు జల వనరుల శాఖ కార్యదర్శితో సమావేశం కావాల్సిందిగా కేంద్ర మంత్రి సూచించారని చెప్పారు.ఏపీ మంత్రి దేవినేని ఉమకు ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా అపెక్స్‌ కమిటీ పేరుతో దాటవేస్తున్నారని అన్నారు. నీటి సమస్యలపై ఏపీ మంత్రితో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. పక్క రాష్ట్రాలతో సఖ్యత కోరుకుంటున్నట్లే, ఏపీతో కూడా అదే వైఖరి కోరుకుంటున్నామని చెప్పారు.అంతకుముందు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్‌ సింగ్‌ తో హరీష్‌ రావు బృందం భేటీ అయింది. వ్యవసాయ రంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను హరీష్‌ రావు ఆయనకు వివరించారు. తెలంగాణలో 330 సైంటిఫిక్‌ గోడౌన్లు ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు.మంత్రి హరీష్‌ రావు వెంట రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మ, టిఆర్‌ఎస్‌ ఎంపీలు బాల్క సుమన్‌, ప్రభాకర్‌ రెడ్డి, బూర నర్సయ్య గౌడ్‌, బీబీ పాటిల్‌, శ్రీనివాసరెడ్డి, మల్లారెడ్డి, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలచారి తదితరులున్నారు.