42శాతం రిజర్వేషన్లతోనే పరిషత్ ఎన్నికలకు వెళ్లాలి

డిసెంబర్ 15 (జనం సాక్షి):కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగానే 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయకుండా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తూ బీసీల నోట్లో మట్టికొడుతున్నదని బీసీ జేఏసీ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య విమర్శించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు త్వరలో నిర్వహిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రిజర్వేషన్లు 42శాతానికి పెంచకుండా ఎన్నికలు నిర్వహిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డిపై బీసీ సమాజం పోరాడటం ఖాయమని హెచ్చరించారు.
ఆదివారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ దేశోద్ధారకభవన్‌లో బీసీ సంఘాల నేతలతో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్‌లో చెప్పిన కాంగ్రెస్.. గెద్దెనెక్కిన తర్వాత నయవంచన చేసిందని ధ్వజమెత్తారు. బీసీలను మోసం చేయడానికి రేవంత్‌రెడ్డి చేస్తున్న కుట్రలను తిప్పికొడుతామని చెప్పారు. బీసీవాదాన్ని పట్టించుకోకుండా గ్లోబల్ సమ్మిట్, ఫుట్‌బాల్ ఆటలతో వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీసీ నేతలు రామ్‌దేవ్‌మోదీ, నీల వెంకటేశ్, బీసీ కుల సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు.



