సిట్ ఎదుట వెంటనే లొంగిపోండి
` ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకు సుప్రీం ఆదేశం
న్యూఢల్లీి(జనంసాక్షి):ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్‌రావుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన వెంటనే సిట్ ముందు లొంగిపోవాలని ఆదేశించింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్.మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం.. శుక్రవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పీఎస్‌లో సిట్ అధికారి ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది. కస్టోడియల్ దర్యాప్తునకు సిట్‌కు అనుమతిచ్చిన ధర్మాసనం.. ప్రభాకర్‌రావుకు భౌతికంగా ఎలాంటి హాని లేకుండా చూడాలని స్పష్టం చేసింది. పిటిషనర్‌కు మధ్యంతర రక్షణ కల్పిస్తూ విచారణకు సహకరించాలని కోర్టు చెప్పినా.. ఆయన దర్యాప్తునకు సహకరించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఐక్లౌడ్ పాస్‌వర్డ్‌లను రీసెట్ చేసి అందులోని వివరాలను దర్యాప్తు అధికారులకు చూపించాలని కోర్టు ఆయనకు చెప్పినప్పటికీ కేవలం రెండు పాస్‌వర్డ్‌లను మాత్రమే రీసెట్ చేశారని.. రీసెట్ చేసిన రెండు అకౌంట్లలోని సమాచారాన్ని ముందే డిలీట్ చేశారని చెప్పారు. జస్టిస్ బీవీ నాగరత్న స్పందిస్తూ.. ’కోర్టు పిటిషనర్‌కు మధ్యంతర రక్షణ కల్పించడం వల్ల దర్యాప్తునకు సహకరించట్లేదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. దీనిపై విూరేమంటారు’ అని ప్రభాకర్‌రావు తరఫున న్యాయవాది రంజిత్‌కుమార్‌ను ప్రశ్నించారు. పిటిషనర్ దర్యాప్తునకు సహకరిస్తున్న విషయాలను వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేసినట్లు ఆయన చెప్పారు. ఆ అఫిడవిట్‌ను మంగళవారం సాయంత్రం 4 గంటలకు దాఖలు చేయడంతో పరిశీలించలేదని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది సిద్దార్థ లూథ్రా బుధవారం జరిగిన విచారణ సందర్భంగా చెప్పారు. ఇరువైపులా వాదనల అనంతరం సిట్ అధికారి ఎదుట ప్రభాకర్‌రావు లొంగిపోవాలని ధర్మాసనం గురువారం ఆదేశాలు జారీ చేసింది.

