అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

డిసెంబర్ 15 (జనం సాక్షి)అప్పుల బాధతో రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా చికిత్స పొందుతూ మృతిచెందిన సంఘటన జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలం తిడుగు గ్రామంలో ఆదివారం చోటుచేసుకున్నది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. తిడుగు గ్రామానికి చెందిన బొబ్బల రాజు (42) తన రెండున్నర ఎకరాల వ్యవసాయ భూమిలో పత్తి, మిర్చి పంటలు సాగు చేశాడు. రెండేండ్లుగా పంటల దిగుబడి సరిగా రాకపోవడంతో సుమారు రూ.3లక్షల వరకు అప్పులపాలయ్యాడు. ఇటీవల కురిసిన అకాల వర్షాలతో మళ్లీ పంటలకు తీరని నష్టం వాటిల్లింది. మరోవైపు ఇద్దరు పిల్లల చదువులకు ఫీజులభారం కూడా తోడుకావడంతో ఆర్థికంగా ఇబ్బంది పడ్డాడు. ఈ నేపథ్యంలో అప్పులు తీర్చే మార్గం కానరాక తీవ్ర మనస్తాపంతో ఈనెల 4న రాజు పురుగుల మందు తాగాడు. గమనించిన స్థానికులు వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. అతడి భార్య బొబ్బల శిరీష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.



