‘ఇథనాల్’పై తిరగబడ్డ రాజస్థాన్ రైతు
దుర్వాసన.. దుర్గంధం.. భూ, జల కాలుష్యం భరించలేం..
రెండేళ్లుగా దండాలూ, దరఖాస్తులు.. సహనం కోల్పోయిన అన్నదాతలు
హనుమాన్‌గఢ్ జిల్లా రథీఖేడాకు తరలొచ్చిన రాజస్థాన్, పంజాబ్, హర్యానా రైతులు
ఫ్యాక్టరీ రక్షణ గోడ ధ్వంసం.. జేసీబీలు, కార్లు, పోలీసు వాహనాలకు నిప్పు
రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగం.. లాఠీచార్జీతో విరుచుకుపడ్డ పోలీసులు
ఇంటర్నెట్ సేవల బంద్.. 107 మందిపై కేసులు, 40 మంది అరెస్ట్
కాంగ్రెస్ ఎమ్మెల్యేతో పాటు పలువురికి తీవ్ర గాయాలు
రైతుల బృందంతో జిల్లా యంత్రాంగం చర్చలు.. ప్రభుత్వానికి రిపోర్ట్
జైపూర్, డిసెంబర్ 12 (జనంసాక్షి) : ప్రజలకు పెనుముప్పుగా పరిణమిస్తున్న ఇథనాల్ కంపెనీలపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణతో పాటు పలుచోట్ల ప్రజా ఉద్యమాలు తీవ్రతరమై ఫ్యాక్టరీలు వెనక్కి వెళ్లిపోగా.. తాజాగా రాజస్థాన్‌లోని రైతాంగం ఇథనాల్‌కు వ్యతిరేకంగా ఉద్యమం తీవ్రతరం చేసింది. కాలుష్య పరిశ్రమలొస్తే తమ జీవనోపాధితో పాటు ఇక్కడ జీవించడమూ కష్టమేనన్న ఆందోళనతో ఏడాదికాలంగా పోరాడుతున్నారు. ఎంత మొరపెట్టుకున్నా ప్రభుత్వ స్పందన లేకపోవడంతో గురువారం రోజున రైతులకు, పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. పోలీసులు టియర్ గ్యాస్, లాఠీచార్జీలతో విరుచుకుపడ్డప్పటికీ.. వేలాది మంది రైతులు, ప్రజలు తరలొచ్చి ఫ్యాక్టరీ వద్ద ప్రహరీ గోడను ధ్వంసం చేశారు. పోలీసు వాహనాలు సహా జేసీబీలు, నిర్వాహకుల కార్లను పగులగొట్టారు. నిరసనను అణిచివేసేందుకు పోలీసులు విశ్వప్రయత్నం చేయగా రైతులు రాళ్లదాడులతో ఎదురుతిరగడం సంచలనంగా మారింది.
రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్ జిల్లా, తిబ్బీ ప్రాంతంలోని రథీఖేడా గ్రామంలో డ్యూన్ ఇథనాల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ 450 కోట్ల రూపాయలతో గ్రెయిన్ ఆధారిత 40 మెగావాట్ ఇథనాల్ ప్లాంట్‌ను నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్ట్ కేంద్ర ప్రభుత్వ ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ (ఈబీపీ) కార్యక్రమానికి మద్దతు ఇస్తుందని కంపెనీ చెబుతోంది. అయితే రెండేళ్లుగా స్థానిక రైతులు, గ్రామీణులు ఈ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా నిరసన చేస్తున్నారు. పీల్చే గాలి, తాగే నీరు కూడా కలుషితమై ఇక్కడ ఉండలేని పరిస్థితి ఉంటుందని, వ్యవసాయ పంటలు నాశనమై జీవనమే లేకుండా పోతుందని వారిలో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో రెండ్రోజుల క్రితం తిబ్బీలో ‘మహాపంచాయత్’ (పెద్ద గ్రామ సభ) నిర్వహించారు. వేలాది మంది రైతులు (రాజస్థాన్, పంజాబ్, హర్యానా నుంచి) ట్రాక్టర్లతో ఫ్యాక్టరీ వద్దకు చేరుకున్నారు. ఫ్యాక్టరీ గోడలను కూల్చి, అక్కడ ఏర్పాటుచేసిన కార్యాలయానికి నిప్పంటించారు. జేసీబీలు సహా పలు పోలీసు వాహనాలకు, ఫ్యాక్టరీ నిర్వాహకుల కార్లకు కూడా నిప్పంటించారు. దీంతో లాఠీచార్జి చేసిన పోలీసులు.. టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ ఘటనతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకోగా.. వేలాది మంది గుమిగూడటం, భారీగా పోలీసు బలగాలు రావడంతో ఇంటర్నెట్ సేవలు కూడా నిలిపివేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే రూపిందర్ సింగ్ కున్నర్‌తో పాటు 40 మందిని అరెస్ట్ చేశారు. మొత్తం 107 మందిపై కేసులు నమోదు. తిబ్బీ ప్రాంతంలో ఇంటర్నెట్ సేవలు బంద్ చేశారు. మార్కెట్లు మూసివేశారు. ఫ్యాక్టరీ సమీపంలో 30 కుటుంబాలు భయంతో ఇళ్లు వదిలి వెళ్లాయి. సంగరియా కాంగ్రెస్ ఎమ్మెల్యే అభిమన్యు పునియా తలకు తీవ్ర గాయాలు కాగా ఆయనను ఆసుపత్రికి తరలించారు. కాంగ్రెస్, సీపీఎం పార్టీలు సహాలు పలు ప్రజాసంఘాలు, రైతు సంఘాలు ఇథనాల్ వ్యతిరేక పోరాటానికి మద్దతుగా నిలిచాయి.
మాయమాటలతో ఫ్యాక్టరీ
హనుమాన్‌గఢ్ జిల్లాలోని సంగరియా నియోజకవర్గ పరిధిలోని తిబ్బి సమీపంలో ‘‘జీరో పొల్యూషన్’’ అనే మాయమాటలతో రైతులను మోసం చేసి ఒక పెద్ద ఇథనాల్ (గ్రెయిన్-బేస్డ్ డిస్టిలరీ) ఫ్యాక్టరీని నిర్మించారు. ఈ ఫ్యాక్టరీ నుంచి రోజూ వెలువడుతున్న దుర్వాసన, నల్లటి పొగ, దుషిత నీటిని పొలాల్లోకి వదిలివేవిధంగా విడుదల చేయడంతో గాలి, నీరు, నేల అన్నీ తీవ్రంగా కలుషితమయ్యాయి. పంటలు ఎండిపోతున్నాయి, పశువులు చనిపోతున్నాయి, పిల్లలు పెద్దలు శ్వాస, చర్మ వ్యాధులతో బాధపడుతున్నారు. గత రెండేళ్లుగా గ్రామస్తులు, రైతులు శాంతియుతంగా ధర్నాలు చేసి ప్రభుత్వంతో పాటు పర్యావరణ బోర్డుకు ఫిర్యాదులు చేశారు. కానీ ఎవరూ స్పందించలేదు. ఉన్నతాధికారులు సైతం కంపెనీకే వత్తాసు పలికారు. దీంతో గతేడాది నుంచి రైతులు వివిధ రూపాల్లో ఆందోళనలు కొనసాగించారు. ఫ్యాక్టరీని ముట్టడిరచేందుకు వేలాది మంది తరలిరావడంతో పోలీసులతో ఘర్షణ జరిగింది.
ప్రజల అనుమతి వద్దా..?
ఫ్యాక్టరీ ద్వారా వెయ్యి మంది వరకు ఉపాధి దొరుకుతుందని చెబుతున్న జిల్లా అధికారులు.. ఫ్యాక్టరీకి అన్ని అనుమతులున్నాయని అంటున్నారు. అయితే పర్యావరణ క్లియరెన్స్ పత్రాలు, స్థానికుల అనుమతి లేకుండా ఫ్యాక్టరీని నడపడం కుదరదని అఖిల భారత కిసాన్ సభ నేత మాంగేజ్ చౌదరి చెప్పారు. ఈ కర్మాగార నిర్మాణాన్ని ఏడాదికిపైగా వ్యతిరేకిస్తున్న రైతులు, ఈ ప్రాంతంలో వాయు కాలుష్యం, నీటి విషప్రభావం ఏర్పడుతుందని, దీనివలన పెద్ద ఎత్తున వ్యవసాయ భూములు బంజరుగా మారుతాయని ఆరోపించారు. ఇది స్థానిక రైతులకు జీవనోపాధి సంక్షోభాన్ని సృష్టిస్తుందని హెచ్చరించారు. ‘బిజెపి ప్రభుత్వ అహంకారం పరాకాష్టకు చేరుకుంది. రైతుల మాట వినడానికి బదులుగా, ప్రభుత్వం నియంతృత్వాన్ని నడుపుతోంది’ అని కాంగ్రెస్ నేత గెహ్లాట్ పేర్కొన్నారు.
రైతుల బృందంతో చర్చలు
రైతుల ఆందోళన నేపథ్యంలో గురువారం 11 మంది రైతుల బృందం జిల్లా యంత్రాంగంతో చర్చలు జరిపింది. ఫ్యాక్టరీ నిర్మాణాన్ని నిలిపివేయాలని, హింసపై న్యాయ విచారణ జరపాలని, నిరసనకారులపై నమోద్కెన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. హనుమాన్‌గఢ్ కలెక్టర్ ఖుషాల్ యాదవ్ మాట్లాడుతూ డిమాండ్ల చార్టర్‌ను రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతామని తెలిపారు. అయితే టిబ్బిలోని సింగ్ సభ గురుద్వారాలో రైతులు, ప్రతిపక్ష పార్టీల స్థానిక నాయకులు గుమిగూడడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. కరణ్‌పూర్ ఎమ్మెల్యే రూపిందర్ సింగ్ కూనర్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కరణ్ సహారన్, మరో ఇద్దరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను బింజ్‌బ్కెలా మండి బస్ స్టాండ్ వద్ద సమావేశానికి వెళుతుండగా అదుపులోకి తీసుకున్నారు. ఎందరిని అరెస్ట్ చేసినా ఈ పోరాటం కొనసాగుతుందని రైతులు భీష్మిస్తున్నారు. ఈరోజు రాజస్థాన్‌లో.. రేపు దేశంలో ఎక్కడ్కెనా పెట్టుబడిదారులు ‘జీరో పొల్యూషన్’, ‘గ్రీన్ ఎనర్జీ’, ‘రైతుల మేలు’ అనే మాయమాటలతో లాభాలు కొల్లగొడుతారని, కానీ ఆ లాభాల వెనుక స్థానిక ప్రజలు, రైతులు, భవిష్యత్ తరాలు శాశ్వతంగా బాధపడాల్సి వస్తుందని రైతు సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మోసాలను సమైక్య పోరాటాలతో అడ్డుకోవాలని సూచిస్తున్నారు.


