కెసిఆర్‌ మాటలను నమ్మితే ఆగమే

16 ఎంపిలతో ఏమి సాధిస్తారు: కోమటిరెడ్డి
యాదాద్రి భువనగిరి,మార్చి26(జ‌నంసాక్షి): 16 ఎంపీ స్థానాలు గెలిస్తే జాతీయ రాజకీయాలను ప్రభావితం చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్న కేసీఆర్‌, కేటీఆర్‌లు ఇంతకాలం వెంట ఉన్న ఎంపీలతో ఏం అభివృద్ధి సాధించారని భువనగిరి కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రానికి  మేలు జరగాలంటే పార్లమెంటులో ప్రజావాణిని బలంగా వినిపించాలంటే కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్‌ గెలిస్తేనే కెసిఆర్‌ కటుఉంబ పాలనకు చరమగీతం పాడవచ్చని అన్నారు. మంగళవారం ఆయన వివిధ ప్రాంతాల్లో ప్రజలను కలుస్తూ ముందుకు సాగారు. తనను అత్యధిక మెజార్టీతో గెలిపించి తెలంగాణ సత్తా చాటాలన్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మోదీ, కేసీఆర్‌ కూటమిని ఓడించి రాహుల్‌గాంధీని ప్రధానిగా చేయాలని అన్నారు.  టీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్లే నన్నారు. మోదీ 2014 ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హావిూలను విస్మరించారన్నారు. విదేశాల నుంచి నల్లధనం తీసుకొచ్చి ప్రతి ఒక్కరి ఖాతాల్లో జమచేస్తామని, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని హావిూ ఇచ్చారన్నారు. అవేవీ అమలుకు నోచుకోలేదని ఆరోపించారు. దేశానికి కాబోయే ప్రధాని రాహుల్‌గాంధీయే నని అన్నారు. సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌ బూటకపు ప్రచారాలతో నాటకాలాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌కు సానుకూల పవనాలు వీస్తున్నాయని, తెలంగాణలో అత్యధిక ఎంపీ స్థానాలు గెలిపించుకుంటే రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వ్యక్తులను టీఆర్‌ఎస్‌ పార్టీ ఎంపీలుగా పోటీ చేయిస్తుందన్నారు. ఉద్యమం జరుగుతుంటే హైదరాబాద్‌లోని భూములను కబ్జా పెట్టుకున్న వ్యక్తిని టీఆర్‌ఎస్‌ పార్టీ నల్లగొండ పార్లమమెంట్‌ బరిలో నిలబెట్టిందని ఆరోపించారు. దేశాన్ని మతపరంగా విచ్చిన్నం చేసి లబ్దిపొందాలని చూస్తున్న వ్యక్తి ప్రధాని నరేంద్రమోదీ అని అన్నారు. ఆయన పాలనలో మైనార్టీల్లో అభద్రతా భావం ఏర్పడిందని విమర్శించారు.జరగబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని ఆదరించి అధికారం అప్పగిస్తే రైతుల సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు.   పార్లమెంట్‌ అభ్యర్థిగా తన విజయానికి కార్యకర్తలందరూ కృషి చేయాలని కోరారు. ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరిస్తానని కోమటిరెడ్డి హావిూ ఇచ్చారు.