కేజ్రీవాల్‌ పార్టీకి నేను ఓటెయ్యను అన్నా హజారే

న్యూఢిల్లీ,డిసెంబర్‌6 (జనంసాక్షి) :
అరవింద్‌ కేజీవ్రాల్‌ కు మరోమారు అన్నా హజారే ఝలక్‌ ఇచ్చారు. గతంలో ఓ మారు ఆయన పార్టీ ఏర్పాటుపై బహిరంగంగా వ్యతిరేకించిన అన్నా ఇప్పు డు ఆయనతో మరోసారి విభేదించారు. కేజ్రీవాల్‌ స్థాపించిన ఆమ్‌ ఆద్మీ పార్టీకి తాను ఓటు వేయనని అన్నా హజారే కుండబద్దలు
కొట్టారు. ఇప్పటివరకూ వేయాలనే అనుకున్నానని, కానీ ఆ పార్టీ కూడా ఇతర పార్టీల్లాగే ‘డబ్బుతో అధికారం, అధికారంతో డబ్బు’ అన్న పంథాలోనే వెళుతుందని కేజీవ్రాల్‌కి అధికారంపై ఆశ వుందని హజారే అభిప్రాయపడ్డారు. కేజీవ్రాల్‌ నిజాయతీ గల అభ్యర్థులను ఎంచుకుంటే ఆ పార్టీకి ఓటేస్తానని హజారే గతంలో ఓ సందర్భంలో పేర్కొన్నారు. అయితే అతను కూడా అన్ని పార్టీలలాగానే ముందుకు వెళుతున్నారని గురువారం వ్యాఖ్యానించారు. ఇదో రకంగా కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ కాగలదని భావిస్తున్నారు.