కేసీఆర్‌ జీ 20 వ తారీఖు అయిపోయింది..

కేంద్ర ప్రభుత్వానికి ఈ నెల 20వరకు డెడ్‌లైన్‌ ఆ తర్వాత తెలంగాణ రాకుంటే ఉద్యమం  తీవ్ర రూపం దాలుస్తుందంటూ టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ స్వామిగౌడ్‌ సన్మాన సభలో అన్న మాటలు. అయితే మరి కెసిఆర్‌కు గుర్తు ఉందో లేదో లేక వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నాడో తెలియదు కానీ ఆయన పెట్టిన గడువు పూర్తయి అపుడే రెండు రోజులు దాటింది. అయితే ఈ రెండు రోజుల్లోనే ఆయనన్నట్లు తీవ్ర ఉద్యమం ప్రారంభం కాకపోయినా కనీసం దానికి సంబంధించిన కార్యాచరణను కూడా ఆయన ఇంతవరకు ప్రకటించకపోవడం కూడా ఆయన వ్యూహమే అంటారేమో టీఆర్‌ఎస్‌ శ్రేణులు. ఆయన ఓ సారి తనకు తెలంగాణ ఏర్పాటుపై బలమైన సిగ్నల్స్‌ అందుతున్నాయంటడు. మళ్లీ రెండు రోజులకే డెడ్‌లైన్‌లు పెడ్తడు. ఓ సారి తెలంగాణ వచ్చే ఈ సమయంలో ఉద్యమాలు ఎందుకంటడు. మరోసారి డెడ్‌లైన్‌ దాటితే ఉద్యమం ఉధృతమవుతుందంటారు. తెలంగాణ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుందని దానిపై తనకు బలమైన సిగ్నల్స్‌ ఉన్నాయని ఓసారి చెప్పాడు. తను పట్టుపట్టి జేఏసి పీఠంపై కూర్చోపెట్టిన కోదండరాం తెలంగాణ సాధన కొరకు తెలంగాణ మార్చ్‌కు సంబంధించిన కార్యాచరణను ప్రకటించగానే టీఆర్‌ఎస్‌ చీఫ్‌కు గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. దీంతో ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగే సమయం ఆసన్నమైందని ఇక ఈ దశలో పోరాటాలు ఎందుకని పలువురు ఆంతరంగికులతో చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అయినప్పటికీ కోదండరాం వినకపోవడంతో ఓ దశలో కోదండరాం స్థానంలో కెేటీఆర్‌ కూర్చోపెట్టబోతున్నట్లు ప్రచారం జరిగింది. తెలంగాణపై తన లాంటి ఉద్యమ నేతలకు సిగ్నల్స్‌ అందుతాయి కానీ దారిన పోయే దానయ్యలకు ఎందుకందుతాయంటూ మండిపడ్డారు. మళ్లీ ఆయనే స్వామిగౌడ్‌ సన్మాన సభలో మాట్లాడుతూ ఈ నెల 20వరకు కేంద్ర ప్రభుత్వానికి గడువు విధించినట్లు దాని తర్వాత ఉద్యమం ఉధృతం చేస్తామంటూ చెప్పుకొచ్చారు. సిగ్నల్స్‌, తెలంగాణ వచ్చె అంటూ చెప్పిన కెేసీఆర్‌ మళ్లీ ఉధ్యమం ఉధృతం చేస్తామనడం ఏంటో ఆయనకే తెలియాలి. ఏమో ఆయన వ్యూహాలేంటో ఆయనకు తప్ప ఇంకెవరికీ అర్థం కావు. తెలంగాణ జేఏసి పిలుపునిచ్చిన తెలంగాణ మార్చ్‌కు విముఖత చూపిన ఆయన మరి ఉధ్యమం ఏ రూపంలో ఉంటుందో, దాని తీరు తెన్నులు ఏంటో వివరిస్తే ప్రజలకు అర్థం అయ్యేది. అయినా రాజకీయనాయకులు తెలంగాణవాదులకు తెలియదనుకుంటే వారు పొరబడినట్లే. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు అయ్యారు. తెలంగాణ ప్రజలకు ఉద్యమాలు ఎలా చేయాలో ఎవరూ చెప్పక్కర్లేదు. వారికి ఉద్యమాలు కొత్తకాదు. రాజకీయ నాయకుల సహకారం లేకుండానే కేవలం జేఏసీ సహకారంతోనే సకల జనుల సమ్మె, సహాయ నిరాకరణ ఉద్యమాలను విజయవంతం చేసిన అనుభవం వారికుంది. ప్రపంచ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ మిలియన్‌ మార్చ్‌ ద్వారా తమ సత్తాను చాటిచెప్పారు. రోజుకో మాట, పూటకో మాటతో ప్రజల ఉద్వేగాలతో ఆడుకొనే పార్టీలను ప్రజలు నమ్మడం ఎపుడో మానేశారు. ఎంత ప్రజా ఉద్యమం అయినా దానికి రాజకీయ మద్ధతు తప్పనిసరి. 2009 ఉద్యమంలో తెలంగాణ ప్రజలకు మద్ధతుగా నిలిచి ఉద్యమించారు కాబట్టే ఇంకా టీఆర్‌ఎస్‌ను ప్రజలు నమ్ముతున్నారు. ఏ పార్టీ అయినా ప్రజల మనోభావాలకనుగుణంగా ఉధ్యమాలు చేపట్టాలి. అపుడే ఆ పార్టీకి ప్రజల మద్ధతు లభిస్తుంది. అదే ప్రజల మనోభావాలతో ఆడుకోవాలని చూస్తే ఆ పార్టీ మనుగడకే ముప్పు తప్పదు. ఇప్పటికైనా గులాబి దళపతి తన మౌనాన్ని తెలంగాణ ఉద్యమ కార్యాచరణ, అది ఏవిధంగా ఉండ బోతోందో తెలపాలి. తెలంగాణ ప్రజల ఓపిక నశిస్తే తమదైన శైలిలో ఉద్యమాన్ని నడిపిస్తరు. చివరికి ఎవరికివారు ఏపార్టీ మద్ధతు లేకుండా స్వతంత్య్రంగా ఉధ్యమించడానికి కూడా సిద్ధమవుతరు. విషయం అంతదాకా రాక ముందే రాజకీయ నాయకులు, ముఖ్యంగా టీఆర్‌ఎస్‌ ఉద్యమ కార్యాచరణను ప్రకటించాలి.