కొండా లక్ష్మణ్‌ ‘బాపూజీ’ అస్తమయం

ఉద్యమాలే ఊపిరిగా జీవించిన కొండా లక్ష్మణ్‌
స్వప్నం నెరవేరకుండానే శ్వాస విడిచిన ఆచార్య
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 21: ఉద్యమ సూరీడు అస్తమించాడు. స్వాతంత్య్ర సమర యోధుడు, తెలంగాణ పోరాట వీరుడు ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ (97) ఇక లేరు. ఉద్యమాలే ఊపిరిగా బతికిన ఆయన.. చిరకాల స్వప్నం ‘తెలంగాణ’ సాకారం కాకుండానే తుదిశ్వాస విడిచారు. కొంత కాలంగా వృద్ధాప్య సమస్యలు, అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని తన స్వగృహంలో కన్నుమూశారు. స్వాతంత్య్ర పోరాట యోధుడిగా, తెలంగాణ ఉద్యమ నాయకుడిగా, రాజకీయ నేతగా, సామాజిక వేత్తగా, ఉపాధ్యాయుడిగా వివిధ రూపాల్లో కీలక పాత్ర పోషించారు. స్వాతంతో్యద్యమంలో తెల్లవారిపై పోరాడి, నిజాం నవాబును ఎదురించి నిలబడిన ధీశాలి ఆచార్య లక్ష్మణ్‌ బాపూజీ.
ఆదిలాబాద్‌ జిల్లా వాంకిడిలో 1915 సెప్టెంబర్‌ 27న జన్మించిన బాపూజీ చిన్ననాటి నుంచే ఉద్యమ బాట పట్టారు. పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన కొండా లక్ష్మణ్‌ ప్రాథమిక విద్యాభ్యాసం ఆదిలాబాద్‌ జిల్లాలోనే సాగింది. ఇంటర్‌, డిగ్రీ హైదరాబాద్‌లోని సిటీ కాలేజీలో పూర్తి చేశారు. చిన్ననాటి నుంచే ధీరత్వాన్ని పుణికిపుచ్చుకున్న 1930లలోనే స్వాతంత్య్ర సంగ్రామంలో కాలుమోపారు. తెల్లవారిని ఎదురించి వీరోచితంగా పోరాడారు. 1942 నాటి క్విట్‌ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. తెలంగాణ తొలి తరం ఉద్యమకారుల్లో బాపూజీ ఒకరు. నాటి నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పించేందుకు నిజాం పాలకులను ఎదురించారు. నారాయణ పటేల్‌తో కలిసి నిజాం నవాబుపై బాంబులు విసిరారు. కుట్ర కేసులో జైలు జీవితం గడిపారు. తెలంగాణ విముక్తి కోసం నాటి కేంద్ర మంత్రి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ను కలిసి నిజాం నిరంకుశ పాలనను వివరించారు. హైదరాబాద్‌ సంస్థానం భారత్‌లో విలీనానికి పరోక్షంగా కారకులయ్యారు.
స్వాతంత్య్రనంతరం ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించిన బాపూజీ ఆంధ్ర మహాసభకు తొలిసారిగా ఎన్నికయ్యారు. 1952 నాటి నాన్‌ ముల్కీ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఇండ్లీ సాంబార్‌ గో బ్యాక్‌ ఉద్యమంలోనూ చురుగ్గా పాల్గొన్నారు. ఈ ఉద్యమం రూపకర్తల్లో బాపూజీ ఒకరు. తెలంగాణ ఉద్యమానికి వారధికి నిలిచిన ప్రొఫెసర్‌ జయశంకర్‌ సమకాలీనుడైన బాపూజీ.. తొలినాళ్లలో ఉపాధ్యాయుడిగా పని చేశారు. అనంతరం రాజకీయాల వైపు మళ్లారు. కాంగ్రెస్‌ పార్టీలో క్రియాశీలకంగా పని చేసిన లక్ష్మణ్‌ ఆసిఫాబాద్‌ నుంచి తొలిసారి శాసనసభకు ఎన్నికయ్యారు. నల్లగొండ జిల్లా చినకొండూర్‌ నుంచి రెండుసార్లు, భువనగిరి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా పని చేసిన బాపూజీ రెండుసార్లు మంత్రిగా, రెండుసార్లు డిప్యూటీ స్పీకర్‌గా పని చేశారు. జలగం వెంగళరావు, కాసు బ్రహ్మానందరెడ్డిల హయాంలో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. రాష్ట్ర అసెంబ్లీకి తొలి డిప్యూటీ స్పీకర్‌ ఆయనే. 1969లో మొదలైన ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారు. మర్రి చెన్నారెడ్డి ఏర్పాటు చేసిన తెలంగాణ సాధన సమితి వ్యవస్థాపకుల్లో బాపూజీ ఒకరు. తెలంగాణ కోసం మంత్రి పదవిని వదులుకున్న తొలి వ్యక్తి ఆయనే. 1969లో ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత కొంతకాలం రాజకీయాల్లో చురుకుగా ఉన్నా.. తదనంతర
కాలంలో పక్కకు తప్పుకున్నారు. పలుమార్లు అవకాశాలు వచ్చినా ఆయన పదవులు తీసుకునేందుకు నిరాకరించారు. 1969 నుంచీ ఇటీవలి కాలం వరకూ తెలంగాణ కోసం ఆయన వివిధ రూపాల్లో ఉద్యమిస్తూనే వచ్చారు. పలు ప్రజా సంఘాల ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. 2001లో తెలంగాణ ఉద్యమం ఉద్ధృతమైన తర్వాత.. వృద్ధాప్యంలోనూ ఆయన ఉద్యమ బాట పట్టారు. నవ తెలంగాణ ప్రజా పార్టీని స్థాపించారు. అనంతర కాలంలో తెలంగాణ ప్రజా ఫ్రంట్‌ ఏర్పాటును ఏర్పాటు చేశారు. వందలాది సభల్లో పాల్గొని తెలంగాణ ఆవశ్యకతను వివరించారు. విభజన సమస్య పరిష్కారానికి లగడపాటి రాజగోపాల్‌, జేసీ దివాకర్‌రెడ్డి వంటి సీమాంధ్ర నేతలతోనూ ప్రత్యేకంగా చర్చలు కూడా జరిపారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఇటీవలే ఢిల్లీ దీక్ష కూడా చేశారు. అఖిల భారత పద్మశాలి సంఘం ఏర్పాటు ఆయన చలవే. బడుగు, బలహీన వర్గాల సంఘాల ఏర్పాటులోనూ క్రియాశీలకంగా వ్యవహరించారు. కొండా లక్ష్మణ్‌ బాపూజీకి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.