చరిత్రలో తొలిసారి..ప్రమాదస్థలానికి సీఎం రేవంత్‌ రెడ్డి

` మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం
` తక్షణ సాయం కింద రూ.లక్ష అందజేత
` పాశమైలారం ఘటనపై ముఖ్యమంత్రి సీరియస్‌
` ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
` ఇకముదు ఇలా జరక్కుండా చర్యలు తీసుకోండి
` బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
సంగారెడ్డి(జనంసాక్షి): పాశమైలారం ప్రమాదంపై సిఎం రేవంత్‌ రెడ్డి ఆరా తీసారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించాలని, గతంలో ఇలాగా ఎప్పుడైనా జరిగిందా అన్నది తెలుసుకోవా లన్నారు. ప్రమాద స్థలిని సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారంఉదయం అధికారులు, మంత్రులతో కలసి పరిశీలించారు. అనంతరం పరిశ్రమలశాఖ అధికారులు, మంత్రులతో సవిూక్షించారు. ప్రమాదం జరిగిన పరిశ్రమలో పరిశ్రమలశాఖ అధికారులు, బాయిలర్స్‌ డైరెక్టర్స్‌ తనిఖీలు చేశారా? బాయిలర్లను తనిఖీ చేసి ఏమైనా సమస్యలు గుర్తించారా? బాయిలర్ల పనితీరుపై యాజమాన్యానికి ఏమైనా సూచనలు చేశారా? అని ప్రశ్నించారు. పరిశ్రమల్లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నివారించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. ఈ పరిశ్రమలో గతంలో ఏమైనా ప్రమాదాలు జరిగాయా అని ప్రశ్నించారు. ఊహాజనిత సమాధానాలు చెప్పవద్దని స్పష్టం చేశారు. ప్రమాద ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని సీఎం ఆదేశించారు. ప్రమాద ఘటనపై నివేదిక కోసం నిపుణులను నియమించాలని సూచించారు. నిపుణులతో చర్చించిన తర్వాతే సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు. కార్మికులకు బీమా సదుపాయం ఉందా అని అడిగి తెలుసుకున్నారు. పరిశ్రమకు అనుమతులు, భద్రతా ప్రమాణాలపై ఆరా తీశారు. సిగాచీ పరిశ్రమకు సంబంధించిన మొత్తం సమాచారం సేకరించాలని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్ని పరిశ్రమల్లో తనిఖీలు చేపట్టాని స్పష్టం చేశారు. ఇలాంటి ప్రమాద సమయంలో మానవత్వంతో వ్యవహరించాలని అధికారులకు సూచించారు. పరిహారం విషయంలో తీసుకున్న నిర్ణయం చెప్పాలని కంపెనీ ప్రతినిధిని అడిగారు. ప్రమాదంపై కంపెనీ యాజమాన్యం బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు. పరిశ్రమలో పనిచేసే వారి నైపుణ్యాల గురించి సీఎం ఆరా తీశారు. ప్రమాదం జరిగి 24 గంటలు దాటినా యాజమాన్యం ఘటనా స్థలికి రాకపోవడం బాధాకరమని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. ప్రమాద ఘటనను కార్మిక, వైద్యశాఖ మంత్రులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. సీఎం వెంట మంత్రులు శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ, వివేక్‌, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఉన్నారు. నిన్న ఉదయం పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమలో పేలుడు సంభవించిన ఘటనలో ఇప్పటి వరకు 36 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.
సిగాచీ యాజమాన్యంపై సిఎం రేవంత్‌ మండిపాటు
సంగారెడ్డి జిల్లా పఠాన్‌ చెరు పాశమైలారం ఘటన మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ఇప్పిస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి హావిూ ఇచ్చారు. అదే విధంగా తీవ్రంగా గాయపడి ఎలాంటి పని చేసుకోలేని స్థితిలో ఉన్న బాధిత కుటుంబాలకు రూ.10 లక్షలు, స్వల్పంగా గాయపడి, తిరిగి పనిచేసుకోగలిగే వారికి రూ.5 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. చనిపోయిన వారి పిల్లల చదువుల బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని, గురుకులాలో సీట్ల గురించి మాట్లాడాలని అధికారులకు సూచించామని చెప్పారు. బాధితులకు ప్రభుత్వం తరఫున వైద్యం అందించే బాధ్యత తీసుకుంటామని తెలిపారు. సిగాచి ఫ్యాక్టరీ ప్రమాదాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని అన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కంపెనీ యాజమాన్యం, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మంగళవారం మంత్రులు, అధికారులతో కలిసి ప్రమాద స్థలాన్ని పరిశీలించిన సీఎం రేవంత్‌.. ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణలో ఇన్ని ప్రాణాలను బలిగొన్న ప్రమాదం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఫైర్‌, హైడ్రా, డిజాస్టర్‌, రెవెన్యూ శాఖల సమన్వయంతో సహాయక చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ఈ ఘటనలో ఎలాంటి సహాయక చర్యలు తీసుకోవాలో ఆదేశించడం జరిగిందని చెప్పారు. ఈ ఘటనలో అధికారిక సమాచారం ప్రకారం 36 మంది చనిపోయారని సీఎం రేవంత్‌ తెలిపారు. ప్రమాద సమయంలో పరిశ్రమలో 143 మంది ఉన్నారని, 58 మంది వివరాలు అధికారుల దృష్టిలోకి వచ్చాయని, మిగతా వారు శిథిలాల కింద ఉన్నారా లేక భయంతో టచ్‌ లోకి రాలేదా అనేది స్పష్టంగా తెలియదని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్రణాళికలన సిద్ధం చేస్తామని చెప్పారు. ఘటనలపై కమిటీ రిపోర్ట్‌ ఇస్తుందని.. ప్రాథమిక సమాచారం తర్వాత ప్రమాదపై పూర్తి వివరాలు చెబుతామని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం పర్యవేక్షిస్తుందని హావిూ ఇస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి ఘటనలను భవిష్యత్‌ లో జరగకుండా ఉండేందుకు.. ఓ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సీఎం రేవంత్‌ చెప్పారు.

36కు చేరిన మృతులు
` డీఎన్‌ఏ పరీక్ష అనంతరం శవాల అప్పగింత
` కొనసాగుతున్న సహాయక చర్యలు
` సుమోటోగా స్వీకరించిన రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌
పటాన్‌చెరు(జనంసాక్షి):సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి ఫార్మాస్యూటికల్‌ కంపెనీలో జరిగిన భారీ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నది. రియాక్టర్‌ పేలుడుతో ఇప్పటివరకు 36 మంది మరణించారు. వివిధ దవాఖానల్లో మరో 31 మంది చికిత్స పొందుతున్నారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే మరణించినవారిలో ఎక్కువ మంది తమిళనాడు, బీహార్‌, జార్ఖండ్‌ రాష్టాల్రకు చెందినవారే ఉన్నారు. ఇప్పటివరకు ఏడు మృతదేహాలను గుర్తించగా, మరో 20 గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. సోమవారం జగన్మోహన్‌, రామ్‌సింగ్‌ రాజ్‌బర్‌, శశిభూషణ్‌ కుమార్‌ మృతిచెందినట్లు గుర్తించగా, తాజాగా మరో ఆరుగురి పేర్లను అధికారులు ప్రకటించారు. లగ్నజిత్‌ దౌరి, బీ.హేమ సుందర్‌, రుక్సానా కతూన్‌, జీ.నికిల్‌ రెడ్డి, నాగేశ్వర్‌ రావు, పొలిషెట్టి ప్రసన్నగా గుర్తించారు. డీఎన్‌ఏ పరీక్షల అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం ఉన్నది. అయితే మృతుల సంఖ్య 55కు పెరిగే అవకాశం ఉంది. బాయిలర్‌ పేలడంతో మూడంతస్తుల అడ్మినిస్టేన్ర్‌ భవనం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఆ శిథిలాల కింద 20 మంది కార్మికులు చిక్కుకున్నారు. వారి కోసం ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌, రెవెన్యూ, హైడ్రా, ్గªర్‌ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ధ్వంసమైన ఎª`లాంట్‌ను పక్కకు తొలగించారు. కాగా, ప్రమాదంపై సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ ప్రావీణ్య మంగళవారం ఉదయం అధికారిక ప్రకటన చేశారు. మొత్తం 47 మంది గల్లంతయ్యారని, ఇప్పటి వరకు 26 మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయని తెలిపారు. 20 మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయని చెప్పారు. 27 మంది కార్మికుల ఆచూకీ తెలియాలేదన్నారు. తీవ్ర గాయాలతో 35 మందికి దవాఖానల్లో చికిత్స అందుతున్నదని, అందులో 11 మంది పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. 57 మంది సురక్షితంగా ఇంటికి వెళ్లారని తెలిపారు.
సుమోటోగా స్వీకరించిన రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌
సంగారెడ్డి(జనంసాక్షి):పాశమైలారం అగ్నిప్రమాద ఘటనను రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌(హెచ్‌ఆర్సీ) సుమోటోగా స్వీకరించింది. జులై 30లోగా ప్రమాద ఘటనపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌, లేబర్‌ కమిషనర్‌, ఫైర్‌ డీజీ, సంగారెడ్డి ఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది.ఈ ఘటనపై జాతీయ బీసీ దళ్‌ అధ్యక్షుడు, న్యాయవాది దుండ్ర కుమారస్వామి హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు చేశారు. పాతబడిన మిషనరీ వాడటం, అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం వల్లే ఈ ప్రమాదం సంభవించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులు, సిగాచి కెమికల్‌ ఫ్యాక్టరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలో పునరావృతం కాకుండా ఇండిపెండెంట్‌ కమిటీ వేసి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కెమికల్‌ ఫ్యాక్టరీలలో నాణ్యతా ప్రమాణాలపై నివేదిక ఇచ్చేలా అధికారులను ఆదేశించాలని హెచ్‌ఆర్సీని కోరారు.