కాంగ్రెస్‌ను మేమే మేల్కొలిపాం

` సీఏం ఆరోపణలపై హరీశ్‌ కౌంటర్‌
హైదరాబాద్‌(జనంసాక్షి):ఏపీ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టు బనకచర్ల విషయంలో కాంగ్రెస్‌ సర్కారును మొద్దునిద్ర నుంచి లేపింది.. ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు తిరస్కరించే వరకు అలుపెరుగని పోరాటం చేసింది బీఆర్‌ఎస్‌ పార్టీయేనని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి ఘాటుగా స్పందించారు. గోదావరిలో వెయ్యి టీఎంసీలు, కృష్ణాలో 500 టీఎంసీలు చాలు అని చెప్పిన రేవంత్‌కు మిగులు జలాల్లోనూ తెలంగాణకు వాటా ఉంటుందని జ్ఞానోదయం చేసింది కూడా బీఆర్‌ఎస్‌ పార్టీయేనన్నారు. మళ్లీ అవే పాత అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడని.. అపెక్స్‌ కౌన్సిల్‌ ఏర్పాటు చేయాలని ఇప్పటికీ ఎందుకు డిమాండ్‌ చేవని ప్రశ్నించారు. చంద్రబాబుపై నువ్వు చూపుతున్న గురు భక్తికి ఇది నిదర్శనం కాదా? అని ప్రశ్నించారు. గోదావరి వాటర్‌ డిస్ప్యూట్‌ బోర్డ్‌ అవార్డు ప్రకారం.. సీడబ్ల్యూ అనుమతి పొందకుండా ఈఏసీ అనుమతి ఇవ్వదన్నారు. ఏపీ అనుమతుల కోసం సీడబ్ల్యూసీకి వెళ్లే కంటే ముందే అపెక్స్‌ కౌన్సిల్‌కు వెళ్లాలనే సోయి కూడా సీఎంకు లేదని విమర్శించారు. కనీస అవగాహన లేని వ్యక్తులు నీటి పారుదల శాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉండడం రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యమన్నారు. తొమ్మిదిన్నరేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో ప్రస్తావనే రాని బనకచర్ల ప్రాజెక్టు.. ఇప్పుడు ఎవరి అండ చూసుకొని ముందుకు వచ్చిందో తెలంగాణ ప్రజలకు తెలియదా? అని ప్రశ్నించారు. మౌనంగా ఉంటూ అందిస్తున్న సహకారం వల్లనే కదా బనకచర్ల వ్యవహారం ఇక్కడి దాకా వచ్చింది రేవంత్‌ రెడ్డి అంటూ చురకలంటించారు. తెలంగాణ నీటి హక్కుల విషయంలో అన్యాయం చేస్తూనే.. లెక్కకు మించి అబద్దాలు ప్రచారం చేస్తూ.. బీఆర్‌ఎస్‌పై చేస్తున్న క్షుద్ర రాజకీయాన్ని తెలంగాణ సమాజం గమనిస్తుందని.. తెలంగాణ వ్యతిరేక విధానాలను అసహ్యించుకుంటున్నారన్నారు.