కేసీఆర్‌ హయాంలోనే బనకచర్లకు అంకురార్పణ

` గోదావరి జలాలను సీమకు తరలించే యత్నం
` పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చిన ఉత్తమ్‌
హైదరాబాద్‌(జనంసాక్షి):ఏపీ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన పోలవరం – బనకచర్ల లింక్‌ ప్రాజెక్ట్‌పై ప్రతిపక్షాలు బాధ్యతా రాహిత్యంగా మాట్లాడుతున్నాయని తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి విమర్శించారు. పోలవరం-బనకచర్లపై కేంద్రానికి మన అభ్యంతరాలను తెలిపామని తెలంగాణ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. బనకచర్ల ప్రాజెక్టు గోదావరి వాటర్‌ ట్రైబ్యునల్‌ తీర్పునకు వ్యతిరేకమని వాదించామన్నారు. ఏపీ ప్రభుత్వం చేసిన బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదనను కేంద్రం వెనక్కి పంపిన నేపథ్యంలో మంత్రి ఉత్తమ్‌ ప్రజాభవన్‌లో పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ‘పోలవరం, ధవళేశ్వరానికి కలిపి ఏపీ 484 టీఎంసీలకు మించి వాడుకోరాదు. పోలవరం నుంచి నీటి ఎత్తిపోతల కోసం 2 టన్నెల్‌ నిర్మాణాలు ప్రతిపాదించారు. రోజుకు 20వేల క్యూసెక్కులు తరలించేలా 2 టన్నెల్స్‌ ప్రతిపాదన పెట్టారు. కేసీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడే బనకచర్ల ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగింది. కృష్ణా గోదావరి జలాల్లో గత పదేళ్లలో రాష్టాన్రికి అన్యాయం జరిగింది. గోదావరి జలాలను సీమకు తరలిస్తుంటే కేసీఆర్‌ నోరెత్తలేదని మంత్రి ఉత్తమ్‌ అన్నారు. మంగళవారం ప్రజా భవన్‌లో బనకచర్లపై మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఈ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లతోపాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. అనంతరం మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ.. కృష్ణా నదిలో ఏపీకి ఎక్కువ నీళ్లు ఇచ్చేందుకు గత ప్రభుత్వం ఒప్పుకొని తెలంగాణ రాష్టాన్రికి బీఆర్‌ఎస్‌ తీరని ద్రోహం చేసిందని మండిపడ్డారు. గోదావరి జలాలను రాయలసీమకు తరలించేందుకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ప్రయత్నాలు మొదలయ్యాయిని ఆయన గుర్తు చేశారు. అంతేకాకుండా తమ ప్రభుత్వంపై దుష్పాచ్రారం చేస్తున్నారంటూ బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలపై మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మండిపడ్డారు. అయితే బనకచర్ల ప్రాజెక్ట్‌ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు తాము చేసిన ప్రయత్నం ఫలించిందన్నారు. తమ వాదనతో కేంద్రం ఏకీభవించిందని స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం పంపిన బనకచర్ల లింక్‌ ప్రాజెక్ట్‌ ప్రతిపాదనను కేంద్రం వెనక్కి పంపిందన్నారు.