కొత్త జిల్లాలపై అఖిలపక్షం
– దసరా నాటికి ఏర్పాడాలి
– రాజకీయ డిమాండ్లను పట్టించుకోవద్దు
– సీఎం కేసీఆర్
హైదరాబాద్,జూన్ 29(జనంసాక్షి): హెచ్‌ఐసీసీలో తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన తెరాస శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… ప్రస్తుతం తెలంగాణలోని జిల్లాల సగటు జనాభా 36 లక్షలు.. ఒక అసెంబ్లీ నియోజకవర్గం రెండు, మూడు జిల్లాల్లోనూ విస్తరించవవచ్చని తెలపారు.జిల్లా కేంద్రానికి దగ్గరున్న మండలాలు అదే జిల్లా కేంద్రంలో ఉండాలని, దసరా నాడు కొత్త జిల్లాల్లో పనులు ప్రారంభం కావాలని సీఎం స్పష్టం చేశారు. ముసాయిదాపై ప్రజలతో మాట్లాడి నివేదికలు ఇవ్వొచ్చని తెలిపారు. త్వరలో అఖిలపక్షం ఏర్పాటు చేసి పార్టీల అభిప్రాయం తీసుకుంటామని చెప్పారు.అన్ని రాష్ట్రాలు పరిపాలనకు అనుగుణంగా ఎప్పటికప్పుడు జిల్లాల పనర్వభజన చేసుకున్నాయని… అదేవిధంగా తెలంగాణలోనూ కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. ఇప్పటివరకు 14 కొత్త జిల్లాల ప్రతిపాదనలు వచ్చాయని… ప్రజల అభిప్రాయం మేరకే జిల్లాల విభజన చేస్తామని స్పష్టం చేశారు. 73 కొత్త మండలాలు ఏర్పాటయ్యే అవకాశం ఉందన్నారు. కాగా దసరా నాటికి తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు కానున్న తరుణంలో రాజకీయ లబ్ది కోసం చేసే ఆందోళనలను అస్సలు పట్టించుకోవద్దని సిఎం కెసిఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. జి/-లలాలు,మండలాలు ఏర్పాటు చేసేందుకు అవసరమైన సూచనలు చేయండని కేసీఆర్ ఎమ్మెల్యేలను కోరారు. బుధవారం కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటుపై టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశమైంది. ఈ సమావేశంలో జిల్లాలు, మండలాల ఏర్పాటుపై చర్చకొనసాగింది. పరిపాలన సౌలభ్యం కోసమే కొత్త జిల్లాల ఏర్పాటు జరుగుతుందని కేసీఆర్ తెలిపారు. చిన్న జిల్లాలతో పరిపాలన బాగుంటుంది. పేద కుటుంబాలను గుర్తించి వృద్ధిలోకి తీసుకురావాలి. జిల్లా కేంద్రాలన్నీ అభివృద్ధి కేంద్రాలుగా మారాలి. కొత్త జిల్లాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలి. కొత్త జిల్లాల ఏర్పాటుపై వచ్చే విమర్శలను పట్టించుకోవద్దు. రాజకీయ కారణాలతో వచ్చే డిమాండ్లు అర్థం లేనివి. ప్రజల డిమాండ్లు, సౌకర్యాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని సీఎం చెప్పారు. కొత్తగా 14 జిల్లాలు, 74 మండలాలుగా విభజిస్తున్నట్టు వెల్లడించారు. కొత్త జిల్లాలపై త్వరలో అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేస్తామని కేసీఆర్ చెప్పారు. ఈ నేపథ్యంలో జిల్లాల వారీగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కూడా భేటీ అయ్యారు. జిల్లా, మండల పునర్ వ్యవస్థీకరణపై చర్చించారు. తమ ప్రతిపాదనలకు కేసీఆర్‌కు ఎమ్మెల్యేలు అందజేయనున్నట్టు తెలుస్తోంది. అయితే ఒక్కొక్కరూ తమ జిల్లాలో ఏర్పడే కొత్త జిల్లాకు పలు పేర్లను సూచిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాకు మంజీర పేరు పెట్టాలని మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు ప్రతిపాదించారు. వరంగల్ జిల్లాలో కొత్తగా ఏర్పడే జిల్లాకు ప్రొఫెసర్ జయశంకర్ పేరు, ఆదిలాబాద్ జిల్లాలో కొత్తగా ఏర్పడే జిల్లాకు కొమరం భీం పేరు పెట్టాలని ఎమ్మెల్యేలు తీర్మానించారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలంతా తమ ప్రతిపాదనలను కే.కేశవరావుకు అందజేశారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు కాబోయే జిల్లాలు, మండలాలపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులకు సీఎం కేసీఆర్ స్పష్టతనిచ్చారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. ‘పరిపాలనా సౌలభ్యం, ప్రజల సౌకర్యార్థమే జిల్లాల పునర్విభజనకు శ్రీకారం చుట్టాం. కొత్త జిల్లాలు, మండలాలు ఏర్పాటుపై ప్రజాప్రతినిధులకు, నాయకులకు పూర్తి అవగాహన ఉండాలన్నారు. దేశంలో ఎప్పటికప్పుడు అన్ని రాష్ట్రాల్లో జిల్లాల పునర్విభజన జరిగింది. కానీ పశ్చిమబెంగాల్, ఆంధప్రదేశ్‌లో జిల్లాల విభజన జరగలేదు. దాని వల్ల జిల్లా యూనిట్‌గా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావడం లేదు. నవోదయ, కేంద్రీయ విద్యాలయాలు రావాలంటే కొత్త జిల్లాలు ఏర్పాటు కావాలి. కొత్తగా ఏర్పాటైన రాష్ట్రం అనుకున్న రీతిలో అభివృద్ధి చెందాలి. రాష్ట్రంలో కొత్త అభివృద్ధి కేంద్రాలు రావాలన్నారు. కొత్తగా 14 జిల్లాలు, 74 మండలాలు ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది. ఒక్కో జిల్లాకు సగటున 20 మండలాలు. జిల్లా కేంద్రానికి దగ్గరున్న మండలాలను అదే జిల్లాలో చేర్చాలి. ఎక్కువ జనాభా కలిగిన నగరాలు, పట్టణాలను అర్బన్ మండలాలుగా మార్చే ప్రతిపాదన ఉంది. ఒక నియోజకవర్గం ఒకే జిల్లాలో ఉండాలనే నిబంధన ఏదీ లేదు. ఒక అసెంబ్లీ నియోజకవర్గం రెండు, మూడు జిల్లాల్లోనూ విస్తరించవచ్చు. జిల్లా కేంద్రానికి దగ్గరగా ఉన్న మండలాలను అదే జిల్లాలో ఉంచాలి. మండల కేంద్రానికి దగ్గరగా ఉన్న గ్రామాలను అదే మండలంలో ఉంచాలన్నారు. త్వరలో అఖిలపక్షం ఏర్పాటు చేసి కొత్త జిల్లాల ఏర్పాటుపై అభిప్రాయాలు తీసుకుంటామని వివరించారు. ఈ సమావేవంలో కె.కేశవరావు, కడియం శ్రీహరిఒ తదితరులు పాల్గొన్నారు.