కొత్త రేషన్ కార్డులు జారీకి ముహూర్తం ఎప్పుడో
వివరాలు సేకరించినా అందని కార్డులు
కార్డుల జారీపై ప్రభుత్వం నుంచి కానరాని స్పష్టత
హైదరాబాద్,నవంబర్11(జనం సాక్షి): కొత్త రేషన్‌కార్డుల కోసం లబ్దిదారులు ఐదేళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఆహార భద్రతా కార్డులను మహిళల పేరుపై జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కార్డు కుటుంబ సభ్యుల వివరాలతో సహా చిప్‌ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. అయితే కార్డుల పంపిణీపై సర్కారు ఐదు సంవత్సరాలుగా వాయిదా వేస్తుంది. ఈ ప్రభుత్వంలోనైనా కొత్త కార్డులు అందేనా అని లబ్దిదారులు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం మాత్రం కార్డుల పంపిణీపై ఎలాంటి స్పష్టమైన ఆదేశాలు జారీచేయడంలేదు. కొత్త కార్డులు ఎప్పుడు అందుతాయన్నది ప్రశ్నార్థకంగానే మారింది. ఉమ్మడి రాష్ట్రంలో జారీచేసిన తెల్లరేషన్ కార్డులను తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వం రద్దు చేసింది. వాటి స్థానంలో తెలంగాణ సర్కార్ ఆహార భద్రతా కార్డులను పంపిణీ చేయాలని నిర్ణయించింది. గత ప్రభుత్వం జారీచేసిన తెల్ల రేషన్‌కార్డులు బహుళ ప్రయోజనాలకు ఉపయోగపడేవి. అయితే ప్రస్తుత సర్కారు ఈ కార్డులు కేవలం నిత్యావసర సరుకులకు మాత్రమే పరిమితి చేసింది. ఆహార భద్రతా పథకం కింద కుటుంబంలో మూడేళ్లు దాటిన వారందరికీ ఆరు కిలల చొప్పున రూపాయికి కిలో బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు. అన్నపూర్ణ కార్డు లబ్దిదారులకు ఉచితంగానే బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. లబ్దిదారులకు నిత్యావసర సరుకులు అందిస్తున్నప్పటికీ, కార్డులు మాత్రం జారీ చేయడం లేదు. లబ్దిదారుల వేలిముద్రల ఆధారంగా రేషన్ సరుకులను పంపిణీ చేస్తున్నారు. హావిూ ఇచ్చినా ఆహార భద్రతా కార్డుల జారీలో జాప్యం జరుగుతోంది. కొత్త కార్డులను పంపిణీ చేస్తామని ప్రభుత్వం పలుమార్లు ప్రకటించింది. కార్డుల మంజూరు కోసం గతంలో రేషన్‌డీలర్ల వారీగా పౌరసరఫరా శాఖ అధికారులు లబ్దిదారుల వివరాలను సేకరించారు. కుటుంబంలోని సభ్యులందరి ఫొటోలతో పాటు సభ్యుల వివరాలను తీసుకున్నారు. కార్డుల జారీకి పొందుపర్చాల్సిన ప్రొఫార్మా ఫారాలను రేషన్ డీలర్లకు అందజేశారు. ప్రొఫార్మాలో ప్రధానంగా కుటుంబ సభ్యుల పేర్లు తప్పుగా ఉన్న పక్షంలో చేర్పులు, మార్పులు చేసుకునే అవకాశం కల్పించింది. కొత్త కార్డుల కోసం లబ్దిదారులు దరఖాస్తు చేసుకుంటున్నారు. కొత్తగా పెళ్లయిన కుటుంబాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు వలస వచ్చిన కుటుంబాలు దరఖాస్తు చేసుకుంటున్నాయి. అధికారులు వచ్చిన దరఖాస్తులపై విచారణ చేపట్టి, ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నారు. కొత్త కార్డుల జారీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాకే లబ్దిదారులకు అందనున్నాయి.