కొల్లం దేవాలయంలో మహా విషాదం
– అగ్ని ప్రమాదంలో 106 మంది మృతి
– ప్రధాని.. రాహుల్ పరామర్శ
– కొనసాగుతున్న సహాయక చర్యలు
కొల్లం,ఏప్రిల్ 10(జనంసాక్షి):పుట్టింగల్ ఆలయ చరిత్రలో పెను విషాదం. అప్పటి వరకు ఉత్సవంలో పాల్గొని సంతోషంగా గడిపిన వారు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. దైవ దర్శనానికి వెళ్లిన తమవారు విగతజీవులయ్యారని తెలుసుకుని బాధితుల బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. క్షణాల్లో జరిగిన ఈ దుర్ఘటన భక్తులను బలితీసుకుంది. నిన్న ఇదే సమయానికి భక్త జనసంద్రంగా మారిన పుట్టింగల్ ఆలయం వద్ద ఇవాళ గంభీర వాతావరణంనెలకొంది.కేరళ రాష్ట్రం కొల్లంలోని పుట్టింగల్‌దేవి ఆలయంలో ఈరోజు తెల్లవారుజామున 3గంటలకు ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 106 మంది మృతి చెందగా.. దాదాపు 350మందికి పైగా గాయపడ్డారు. ఆలయ వేడుకల్లో భాగంగా కొందరు భక్తులు బాణసంచా కాల్చడంతో ప్రమాదవశాత్తూ పెద్ద ఎత్తున మంటలు చెలరేగి ఆలయం నలువైపులా వ్యాపించాయి. భారీ శబ్దాలతో పేలుళ్లు, అగ్నికీలలు చూసి ఆలయంలో ఉన్న భక్తులు భయంతో ఒక్కసారిగా పరుగులు తీశారు. అగ్ని ప్రమాదంలో కొందరు మృతిచెందగా, తొక్కిసలాటలో మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని తీవ్రంగా శ్రమించి మంటలు ఆర్పివేశారు.క్షతగాత్రులలో ఎక్కవ మందిని త్రివేండ్రం వైద్య కళాశాలకు, సవిూపంలోని మరికొన్ని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో జనసమూహం ఎక్కువగా ఉండటంతో ప్రమాద తీవ్రత పెరిగింది. అగ్నిమాపక సిబ్బంది, సహాయక సిబ్బంది ప్రొక్లెన్ల సాయంతో శిథిలాలను తొలగించి క్షతగాత్రులందరినీ ఆసుపత్రికి తరలించారు. ఆలయం వద్ద బాణసంచా పేలుడుకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని అధికారులు చెబుతున్నారు. పుట్టింగల్ ఆలయ అధికారులు, బాణసంచా లైసెన్సు దారులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాణసంచా పేలుళ్ల ధాటికి భవనాలు సైతం కుప్పకూలాయంటే ప్రమాద తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఘటనపై న్యాయవిచారణకు ఆదేశించినట్లు కేరళ ¬ం మంత్రి రమేశ్ చెన్నితల తెలిపారు.
‘విూనాభరణి’ వేడుకల సందర్భంగా ప్రమాదం
ఎన్నో ప్రచీన ఆలయాలకు కేంద్రంగా కేరళ భాసిల్లుతోంది. కొల్లం జిల్లాలో కొలువు దీరిన పుట్టింగల్ అమ్మవారికి శతాబ్దాలుగా విూనా భరణి ఉత్సవం నిర్వహిస్తున్నారు. మలయాళ నెలల ప్రకారం భరణి నక్షత్రంలో విూనాభరణి ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. పురుషులు మహిళలుగా అలంకరించుకుని అమ్మవారికి దీపారాధన చేయడం ఈ ఉత్సవంలో ప్రత్యేకత. వీటితో పాటు అశ్వితి విలక్కు, కథాకళి, కంపడికాలి, మరమేడప్పు తదితర ఉత్సవాలను సైతం భారీగా నిర్వహిస్తారు. అమ్మవారికి దీపారాధన చేసిన తర్వాత బాణసంచా కాల్చడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా కొందరు అత్యుత్సాహంతో బాణసంచా పేల్చడం భక్తుల పాలిట శాపంగా మారింది. పుట్టింగల్ ఆలయ చరిత్రంలో పెను విషాదం నింపింది.
ప్రమాద స్థలిని పరిశీలించిన కేరళ సీఎం
ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని కేరళ ముఖ్యమంత్రి వూమెన్ చాందీ, మంత్రులు పరిశీలించారు. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని స్పష్టం చేశారు. ఘటనాస్థలి నుంచే ప్రదాని మోదీతో ఫోన్‌లో మాట్లాడారు. అన్ని విధాలా సహకరిస్తామని వూమెన్ చాందీకి ప్రధాని మోదీ తెలిపినట్లు సమాచారం. ఘటనా స్థలంలో సహాయక చర్యలు పూర్తయ్యాయని, క్షతగాత్రులకు వైద్య సాయంపై దృష్టి పెట్టామని సీఎం తెలిపారు. అగ్నిప్రమాద ఘటనపై మధ్యాహ్నం 3గంటలకు కేరళ మంత్రి వర్గం సమావేశం కానుంది.
మృతుల కుటుంబాలకు రూ.2లక్షల పరిహారం: ప్రధాని
కేరళలోని పుట్టింగల్ ఆలయంలో అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్రగ్భ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేరళ వెళ్లి బాధితులను పరామర్శించనున్నట్లు ప్రధాని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఘటనాస్థలికి వెళ్లి సహాయక చర్యలు పర్యవేక్షించాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాను ప్రధాని ఆదేశించారు. కేరళ ముఖ్యమంత్రి వూమెన్ చాందీతో ఫోన్‌లో మాట్లాడి ప్రమాదం వివరాలు తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు ప్రధాని ప్రకటించారు.
క్షతగాత్రులకు రాహుల్ పరామర్శ
కొల్లం: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, , కేంద్ర మాజీ మంత్రి ఆంటోని కేరళలోని కొల్లం చేరుకున్నారు. పుట్టింగల్ ఆలయంలో సంభవించిన అగ్నిప్రమాదంలో గాయపడి… చికిత్స పొందుతున్న బాధితులను వారు పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరు, ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.