ఖరీఫ్‌ నుంచి వడ్డీలేని రుణాలు

20 సూత్రాల కార్యక్రమంలో ఏపీనే ఫస్ట్‌
హైదరాబాద్‌, జూలై 2 (జనంసాక్షి ): అభివృద్ధి విషయంలో ప్రతిపక్షాల సహకారం కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నామని ముఖ్యమంత్రి ఎన్‌. కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. జూబ్లీహా లులో సోమవారం ఉదయం 20 సూత్రాల కార్యక్రమం ఆవిర్భావ దినోత్సవం జరిగింది. ముఖ్యమంత్రి ఈ కార్యక్రమంలో పాలుపంచు కున్నారు. ఆయన మాట్లాడుతూ ఈ ఖరీఫ్‌ నుంచేరైతులకు వడ్డీ లేని రుణాలను అందిస్తున్నామన్నారు. లక్ష రూపాయల లోపు రుణం తీసుకునే వారు వడ్డీ కట్టనవసరం లేదన్నారు. ఆ వడ్డీని ప్రభుత్వమే భరిస్తుంద న్నారు. ప్రభుత్వమే బ్యాంకర్లకు చెల్లిస్తుందన్నారు. ఇందిరమ్మ రాజ్యం తెస్తామంటేనే 2004 ఎన్నికల్లో తమ పార్టీకి ప్రజలు పట్టం కట్టారని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ చేపట్ని సంక్షేమ పథకాలను కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్విఘ్నంగా కొనసాగిస్తోందన్నారు. 20 సూత్రాల కార్యక్రమం అమలులో ఆంధ్రప్రదేశ్‌ అగ్ర స్థానంలో నిలిచిందని చెప్పారు. ఈ ఏటా 52వేల కోట్ల రూపాయలమేర వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లు లక్ష్యంగా పెట్టుకున్నారని చెప్పారు. అందులో 32వేల కోట్ల రూపాయలను వ్యవసాయ రైతులకు అందించేందుకు సంకల్పించారన్నారు. లక్ష రూపాయల లోపు రుణం తీసుకున్న రైతులు సంవత్సరంలోగా తిరిగి చెల్లిస్తే అట్టి వారు వడ్డీ కట్టనవసరం లేదన్నారు. ప్రభుత్వమే నేరుగా బ్యాంకర్లకు వడ్డీ చెల్లిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మంత్రులు ఆనం రాంనారాయణరెడ్డి, రామచంద్రయ్య, కాంగ్రెస్‌ నేత తులసీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదివారం చోటు చేసుకున్న అగ్నిప్రమాద ప్రాంతాన్ని పరిశీలించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక మీదట అలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని వారికి సూచించారు.