గ్రూప్‌-2 పరీక్షకు 75.66శాతం హాజరు

ఏలూరు, జూలై 21 : పశ్చిమ గోదావరి జిల్లాలో ఏపిపిఎస్‌సి గ్రూపు-2 పరీక్షలకు తొలిరోజు 75.66 శాతం విద్యార్థినీ విద్యార్థులు హాజరయ్యారని పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా ఇన్‌ఛార్జ్‌ జాయింట్‌ కలెక్టరు మిరియాల వెంకట శేషగిరిబాబు చెప్పారు. వట్లూరులోని సిఆర్‌రెడ్డి పాలిటెక్నిక్‌ కళాశాలలో గ్రూపు-2 పరీక్షా కేంద్రాన్ని శనివారం సాయంత్రం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఏలూరులోని 50 సెంటర్లలో ప్రశాంతంగా జరిగాయని చెప్పారు. గ్రూపు-2 పరీక్షలకు జిల్లాలో 17వేల 300 మంది అభ్యర్ధులు ధరఖాస్తు చేసుకోగా 14వేల 520 మంది మాత్రమే హాల్‌ టిక్కెట్లను డౌన్‌లోడ్‌ చేసుకున్నారన్నారు. తొలిరోజు పరీక్షకు 10వేల 986 మంది (75.66శాతం) హాజరైనట్లు ఆయన చెప్పారు. 50 సెంటర్లను 14 రూట్లుగా విభజించి 145మంది లైజాన్‌ ఆ ఫీసర్లను నియమించామని 50 మంది డిప్యూటీ తహసిల్ధార్లను అసిస్టెంటగ్‌ సమన్వయంతో తొలిరోజు పరీక్షను సమర్థవంతంగా నిర్వహించారని శ్రీ శేషగిరి బాబు చెప్పారు. కొన్ని కేంద్రాలలో నిర్ధేశించిన సమయం దాటిన తర్వాత కొంతమంది అభ్యర్థులు రావడంతో వారిని పరీక్షాకేంద్రంలోకి అనుమతించలేదని చెప్పారు.పొరపాట్లును గుర్తించి ఈ నెల 22వ తేదీన జరిగే పరీక్షకు అభ్యర్థులు ముందుగానే హాజరు కావాలని శేషగిరిబాబు సూచించారు. 22వ తేదీ ఉదయం 10 గంటల నుండి 12.30 గంటల వరకు, మధ్నాహ్నం 2 గంటల నుండి 4.30 గంటల వరకూ పరీక్ష జరగనున్నట్టు చెప్పారు. ఆదివారం కూడా జిల్లాలో ప్రతీ ఆర్‌టిసి డిపో నుండి అదనంగా పది బస్సులను నడపనున్నట్టు చెప్పారు. గ్రూపు-2 పరీక్షల్లో మాల్‌ ప్రాక్టీస్‌కు పాల్పడితే అభ్యర్థులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పరీక్షా కేంద్రాలు సమీపంలో ఆదివారం కూడా ఫోటోస్టాట్‌ సెంటర్లు మూసివేయాలని ఎవరైనా తెరిస్తే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని శ్రీశేషగిరి బాబు హెచ్చరించారు. ప్రతీ పరీక్షా కేంద్రం వద్ద 144వ సెక్షన్‌ ఆదివారం సాయంత్రం వరకూ విధించడం జరిగిందని, గట్టి పోలీస్‌ బందోబస్త్‌ మధ్య గ్రూపు-2 పరీక్షలను నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు.