రాహుల్‌ని మాట్లాడనివ్వడం లేదు
` రేయింబవళ్లు నెహ్రూను విమర్శించేవారు నేడు ఆయనను ప్రశంసిస్తున్నారు
` రాహుల్ ప్రశ్నలకు ప్రభుత్వం దగ్గర సమాధానాలు లేవు!
` అమెరికా ముందు భారత ప్రభుత్వం తలవంచింది
` కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ఆగ్రహం
లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లపై అవిశ్వాసం
జగదంబికా పాల్ ప్రత్యేక స్పీకర్‌గా విధులు
న్యూఢిల్లీ(జనంసాక్షి):లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం గురించి లోక్‌సభలో చర్చ ప్రారంభమైంది. ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానాన్ని కాంగ్రెస్ ఎంపీ మహమ్మద్ జావెద్ లోక్‌సభలో మంగళవారం ప్రవేశపెట్టారు. అనంతరం దీనిపై చర్చ ప్రారంభమైంది. ఈ చర్చ కోసం పది గంటల సమయం కేటాయించారు. అనంతరం తీర్మానంపై ఓటింగ్ నిర్వహించనున్నారు. స్పీకర్ ఓం బిర్లా నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని, ఆయన అధికార పార్టీ భాష మాట్లాడుతున్నారని తీర్మానాన్ని ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ఎంపీ మహమ్మద్ జావెద్ ఆరోపించారు. అనంతరం అవిశ్వాస తీర్మానంపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు చర్చను ప్రారంభించారు. స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం గురించి చర్చ జరుగుతున్న సమయంలో సభను నడిపేందుకు ప్రత్యేక సభాపతిని నియమించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ డిమాండ్‌కు కేంద్రం అంగీకరించింది. సీనియర్ ఎంపీ, చైర్ పర్సన్స్ ప్యానెల్ సభ్యుడు జగదాంబికా పాల్‌ను నియమించింది. ఆయన నేతత్వంలో ప్రస్తుతం స్పీకర్ ఓం బిర్లా అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టారు. ప్రతిపక్షాల తరపున కాంగ్రెస్ ఎంపి గౌరవ్ గొగోయ్ మాట్లాడుతూ.. భారత్`అమెరికా వాణిజ్య ఒప్పందం సహా పలు అంశాలపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీకి మాట్లాడేందుకు యత్నించారని, కానీ స్పీకర్ అనుమతినివ్వలేదని అన్నారు. ప్రతిపక్ష ఇండియా కూటమికి లోక్‌సభలో సుమారు 200మంది సభ్యులున్నప్పటికీ.. డిప్యూటీ స్పీకర్ లేరని అన్నారు. డిప్యూటీ స్పీకర్ లేకుండా సభ ఎలా నడుస్తుందో దేశ ప్రజలు చూడాలని అన్నారు. మైక్‌ని కూడా ఆయుధంగా వినియోగి స్తున్నారని అన్నారు. ఎన్‌డిఎ సభ్యులకు మాట్లాడేందుకు అనుమతినిస్తున్నారని, కానీ ప్రతిపక్షాలకు మాట్లాడేందుకు మైక్‌ని ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారని అన్నారు. అయితే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సభలో హుందాగా మెలగడం లేదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. ఈ క్రమంలో గతంలో ప్రధాని మోదీని రాహుల్ ఆలింగనం చేసుకున్న ఘటనను ప్రస్తావించారు. ప్రధాని మోదీ దగ్గరకు వచ్చిన రాహుల్.. ఆలింగనం చేసుకొని వెళ్లి తన సీట్లో కూర్చున్నారు. అనంతరం తోటి ఎంపీలను చూసుకుంటూ కళ్లు ఎగరవేశారు. అటువంటి నేతను ఎప్ప్పుడూ చూడలేదు‘ అని కిరణ్ రిజిజు పేర్కొన్నారు. ఈ సందర్భంగా గతంలో నెహ్రూ చెప్పిన నాటి స్పీకర్ జీవీ మావలాంకర్‌ను సమర్థిస్తూ మాటలను గుర్తుంచుకోవాలని కాంగ్రెస్ నేతలకు సూచించారు. దీనిపై దీటుగా స్పందించిన ప్రియాంకా గాంధీ.. ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.రిజిజు విమర్శలను ఎంపీ ప్రియాంకా గాంధీ తిప్పికొట్టారు. విపక్ష నేత రాహుల్ గాంధీ చెప్పే విషయాలను అధికార పక్షం జీర్ణించుకోలేక పోతోందన్నారు. గడిచిన 12 ఏళ్లలో ప్రభుత్వానికి దీటుగా నిలిచిన వ్యక్తి రాహుల్ ఒక్కరేనని అన్నారు. నెహ్రూను ఎప్ప్పుడూ విమర్శించే వాళ్లు అకస్మాత్తుగా ఆయన్ను ప్రశంసించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అందుకే తనకు నవ్వు వస్తోందన్నారు. నిరంతరం నెహ్రూను ఆడిపోసుకుంటున్న వారు ఆయన గురించి మాట్లాడంతో నవ్వు ఆపుకోలేక పోయానని అన్నారు. అయితే, ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ సభలో లేని సమయంలో ఈ చర్చ జరిగింది. ఆ సమయంలో స్పీకర్ స్థానంలో టిడిపికి చెందిన తెన్నేటి కష్ణప్రసాద్ ఉన్నారు.
రేయింబవళ్లు నెహ్రూను విమర్శించేవారు నేడు ఆయనను ప్రశంసిస్తున్నారు
కేంద్ర ప్రభుత్వం స్పీకర్ ఓం బిర్లాపై ఒత్తిడి తెచ్చి ఆయన స్వాతంత్య్రానికి ఆటంకం కలిగించిందని ప్రియాంక గాంధీ ఆరోపించారు. అందుకే ఓం బిర్లాపై విపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని తీసుకురావాల్సిన అవసరం వచ్చిందన్నారు. రాహుల్ గాంధీ సభలో లేవనెత్తిన ప్రశ్నలకు ప్రభుత్వం దగ్గర సమాధానాలు లేవని విమర్శించారు. అందువల్లే ప్రజల దష్టిని మళ్లించడానికి కేంద్రం ప్రభుత్వం సభలో అసంబద్ధమైన అంశాలను లేవనెత్తుతోందని పేర్కొన్నారు.లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా కీలక వ్యాఖ్యలు చేశారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ వేళ మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఉదహరించడాన్ని తీవ్రంగా విమర్శించారు. దేశ తొలి ప్రధాని నెహ్రూను రేయింబవళ్లు విమర్శించే వారు ఇప్పుడు ఆయన వ్యాఖ్యలను ఉటంకిస్తున్నారని ఎద్దేవా చేశారు.తాను నవ్వుతున్నానని రిజిజు చెబుతున్నారని, అందుకే రేయింబవళ్లు తనను విమర్శిస్తున్నారని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. తమ వాదన కోసం రిజిజు నెహ్రూ వ్యాఖ్యలను ఉటంకించారని తాను తెలియజేస్తున్నానన్నారు. “వారు (రిజిజును ఉద్దేశించి) అకస్మాత్తుగా నెహ్రూను గౌరవించడం ప్రారంభించారు. నెహ్రూ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం కోసం అలాంటి ప్రసంగం చేశారు “ అని ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించారు.కేంద్ర ప్రభుత్వం ముందు తలవంచని ఏకైన వ్యక్తి ఉన్నారని, ఆయనే ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అని ప్రియాంక గాంధీ తెలిపారు. ఈ సభలో విపక్ష నేత ఎటువంటి సంకోచం లేకుండా నిజాలు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ట్రెజరీ బెంచీలపై కూర్చున్న వారు ఆ సత్యాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు.పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో విలేకరులతో మాట్లాడుతూ కేంద్రంపై ప్రియాంక మండిపడ్డారు. ట్రేడ్ డీల్‌పై సంతకం చేయడం ద్వారా భారత ప్రభుత్వం అమెరికా ముందు తలవంచిందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వ సంస్థలను నాశనం చేసిందని విమర్శించారు. ప్రతిపక్షాలు ప్రభుత్వ సంస్థలను కాపాడటానికి ప్రయత్నిస్తున్నాయని తెలిపారు.


