చంద్రబాబువి చిల్లర రాజకీయాలు : లగడపాటి

విజయవాడ, జూన్‌ 25: ఉనికి కోసం టిడిపి ఆరాట పడుతుందని, అందుకనే అర్థంపర్ధం లేని ఆందోళనలు చేపడుతోందని విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్‌ దుమ్మెత్తిపోశారు. చంద్రబాబువి చిల్లర రాజకీయాలన్నీ, ఏదో ఒక విధంగా వార్తలు ఉండాలని చూసుకోవడమే ఆయనకు చేతనైందని ఎంపి ఏకిపారేశారు. కనకదుర్గమ్మ ఆలయం వద్ద ప్లైఓవర్‌ నిర్మించాలన్న టిడిపి ఆందోళనలో పాల్గొన్న చంద్రబాబుపై ఆయన సోమవారం నిప్పులు చెరిగారు. ఒకవైపు కొండ, మరోవైపు నది, ఇంకోవైపు గుహలు ఉన్న కనకదుర్గమ్మ ఆలయం సమీపంలో ప్లైఓవర్‌ నిర్మాణం ఎలా సాధ్యమో, ఎంత కష్టమో చంద్రబాబు తెలుసుకోవాలన్నారు. ముఖ్యంగా ట్రాఫిక్‌ సమస్యను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ ప్లైఓవర్‌ నిర్మాణానికి ఎంత లేదన్న రెండేళ్లు పడుతుందని, అప్పటివరకు ట్రాఫిక్‌ను ఏమి చేస్తారని ఆయన ప్రశ్నించారు. అన్ని ఆలోచించే సాంకేతిక సమస్యలను దృష్టిలో పెట్టుకొని ప్లైఓవర్‌ నిర్మాణం విషయంలో తాను ఆచితూచి వ్యవహరిస్తున్నానన్నారు. దీనిని తన అసమర్ధతగా చిత్రీకరించడం చంద్రబాబు దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. బెంజి సర్కిల్‌ వద్ద ప్లైఓవర్‌ నిర్మాణ కాంట్రాక్టు తీసుకున్న టిడిపి ఎంపి ఇప్పటికీ పని ప్రారంభించకుంటే ఏ మి అనని చంద్రబాబు దుర్గ గుడి వద్ద ప్లై ఓవర్‌ కోసం తగుదునమ్మ అంటూ తరలిరావడం సిగ్గుచేటన్నారు. ఏదేమైనా 2014లోపు తన ఎంపి పదవి కాలం ముగిసేనాటికి ప్లై ఓవర్‌ నిర్మించి తీరుతామని లగడపాటి ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు.