‘చలో హైదరాబాద్‌’తో దిమ్మతిరగాలె కోదండరాం

హైదరాబాద్‌, ఆగస్టు 7 (జనంసాక్షి): ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా సెప్టెంబర్‌ 30వ తేదిన తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ కమిటీ (టీజెఎస్‌) ఆధ్వర్యంలో ‘చలో హైదరాబాద్‌’ కార్యక్రమాన్ని చేపట్టాలని మంగళవారం ఇక్కడ బీజేపీ నిర్వహించిన రైండ్‌ టేబుల్‌ సమావేశంలో నిర్ణయించారు.
బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అధ్యక్షతన సుమారు ఐదు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో పాల్గొన్న సుమారు 60 మంది తెలంగాణ ఉద్యమ నేతలు ‘తెలంగాణ రాష్ట్ర సాధన’ అంశం పై తమ అభిప్రాయాలను వెల్లడించారు. బుధవారం నుంచీ ప్రారంభమయ్యే పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని ఈ సమావేశం తీర్మానించింది.
తెలంగాణ కోసం పార్లమెంట్‌ సమావేశాల్లో బీజేపీ లోనీ జాతీయ స్థాయి నేతలు సైతం స్తంభింపజేసినప్పుడు ఉద్యమం విషయంలో ఈ పార్టీ నిబద్ధత, అంకితభావం బుజువవుతాయని, తాము కూడా విశ్వసించ గలమని ఈ సమావేశంలో మాట్లాడిన టీ-జేఏసీ కోదండరాం అన్నారు. ”తెలంగాణ అంశం జాతీయ అంశం సుమారు 850 మంది ప్రాణత్యాగం చేశారు. బీజేపీకి ఇంత కంటే ప్రాధాన్యతాంశం ఏం కావాలి?”అని అడిగారు. రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పాల్గొన్న నేతలంతా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రాధాన్యతను నొక్కి చెప్పారు. ‘చలో హైదరాబాద్‌’ కార్యక్రమానికి ‘కాంగ్రెస్‌కో ఖతం కరో ..తెలంగాణ కో హీసిల్‌ కరో’ ప్రధాన నినాదంగా ఉంటుందన్నారు.