చెరువుల్లో నీటిని నింపండి : వట్టి

ఏలూరు, జూన్‌ 27 : మంచినీటి చెరువుల్లో నీటిని నింపాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వట్టి వసంతకుమార్‌ అధికారులను ఆదేశించారు. భీమడోలు మండలం ఎంఎంపురంలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజా సమస్యలను స్వీకరించారు. భీమడోలు, నల్లజర్ల, ద్వారకా తిరుమల, నిడమర్రు, గణపవరం, ఉంగుటూరు మండలాలకు చెందిన కొందరు మంత్రికి వినతిపత్రాలు అందజేశారు. వాటిని పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. సమస్యలపై మంత్రి స్పందిస్తూ అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి నిధులతో ఆయా గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, ఇందుకు అవసరమైన నిధులను విడుదల చేస్తామని వసంతకుమార్‌ హామీ ఇచ్చారు. క్రొవ్విడి గ్రామం ఎస్‌సి పేటలో 70 ఇళ్ల నిర్మాణానికి అవసరమైన పట్టాలు ఇచ్చారని, ఇళ్లు నిర్మించుకోడానికి స్థలాన్ని మెరక చేయాలని పలువురు మంత్రిని కోరారు. ఆయన స్పందిస్తూ ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ పథకం కింద తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. నల్లజర్ల మండలం చీపురుగూడెం గ్రామంలో 2.90 లక్షల రూపాయలతో మంజూరైన బోరును ఇందిర జలప్రభ పథకం కింద బోరు నిర్మాణానికి తగు చర్యలు తీసుకోవాలని గుత్తాల పాపారావు, కొడపాటి వెంకటేశ్వరరావు, సుబ్బారావు, తదితరులు మంత్రిని కోరారు. ఈ విషయంపై తగు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఆవుపాడు గ్రామంలో ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని, ప్రకాశరావుపాలెం నుంచి ఉంగుటూరు వరకు దెబ్బతిన్న ఆర్‌ అండ్‌ బి రోడ్డు నిర్మించాలని చెల్లు వీరవెంకటరావు అనే వ్యక్తి కోరారు. దీనిపై మంత్రి స్పందిస్తూ అధికారులతో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఏలూరు ఆర్డీవో కె.నాగేశ్వరరావు, భీమడోలు తహసీల్దారు సోమశేఖర్‌, భీమడోలు మండల ప్రత్యేకాధికారి ఆర్‌వివి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.