జండాలు పక్కనబెట్టి తెలంగాణ కోసం కలబడదాం రండి

డెడ్‌లైన్‌ పెట్టి తెలంగాణ కోసం టీ నేతలంతా ఏకమై పోరాడాలి
కోదండరామ్‌ పిలుపు
హైదరాబాద్‌, జూలై 28 (జనంసాక్షి): జండాలు పక్కన పెట్టి తెలంగాణ కోసం నేతలంతా ఒక్కటి కావాలని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్‌ కోదండరాం పిలుపునిచ్చారు. హైద్రాబాద్‌లో జరిగిన సమావేశంలో ఆయన ఉద్యోగ సంఘాల నేతలు, జేఏసీ సభ్యులతో సమావేశమ య్యారు. జండాలు, అజెండాలు పక్కన పెట్టి తెలంగాణ కోసం పోరాడాలని, తెలంగాణపై హైకమాండ్‌కు ఎంపీలు డెడ్‌లైన్‌ విధించాలని, టీ నేతలంతా ఏకమై తెలంగాణ కోసం పోరాడాలని సూచించారు. తెలంగాణకోసం టీ నాయకులు పార్టీలు, జెండాలు పక్కన పెట్టాలని సమిష్టిగా పోరాడి తెలంగాణను సాధించుకోవాలన్నారు. తెలంగాణ ఉద్యమం ఇంత
తీవ్రంగా జరుగుతున్న సమయంలోనూ తెలంగాణకు అన్యాయం జరుగుతూనే ఉందన్నారు. మెడికల్‌ సీట్ల విషయంలో సీమాంధ్ర ప్రభుత్వం తెలంగాణ కళాశాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిందనీ అందుకే తెలంగాణలో మెడికల్‌ సీట్లు పెరగలేదన్నారు. అదేవిధంగా సాగర్‌ జలాల విషయంలోనూ తెలంగాణ ప్రజల ఆందోళనలను ఖాతరు చేయకుండా వ్యవహరించిందనీ, కోర్టు జోక్యం చేసుకొని తెలంగాణకు న్యాయం జరిగేలా చేసిందన్నారు. సెప్టెంబర్‌ 30న జరిగే తెలంగాణ మార్చ్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. టీఎన్‌జీవో చైర్మన్‌ స్వామి గౌడ్‌ మాట్లాడుతూ తెలంగాణకు ప్రత్యేక సర్వీసు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. సకలజనుల సమ్మెలో పార్టీలు సహకరించలేదని ఆరోపించారు. ఈ సమావేశంలో ఉద్యోగసంఘ నేతలు, జేఏసీ నేతలు పాఒ్గన్నారు.