జిల్లాలో పాఠశాలల బంద్‌ విజయవంతం

నిజామాబాద్‌, జూలై 17 : విద్యారంగం సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విద్యార్థి సంఘాలు ఇచ్చిన పిలుపుమేరకు మంగళవారం జిల్లాలోని విద్యా సంస్థలు మూత పడ్డాయి. పీడీఎస్‌యూ, ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎఫ్‌, హెచ్‌ఎఫ్‌ఐ తదితర విద్యార్థి సంఘాలు ఇచ్చిన బంద్‌ పిలుపుమేరకు విద్యా సంస్థలు ఒకరోజు ముందుగానే సెలవును ప్రకటించాయి. నిజామాబాద్‌లో విద్యార్థి సంఘాల నాయకులు ఊరేగింపు జరిపారు. ప్రైవేట్‌ పాఠశాలల్లో ఫీజులను నియంత్రించాలని డిమాండ్‌ చేశాయి. పాఠశాలలు, కళాశాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని విద్యార్థి సంఘాలు కోరాయి. మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో జేఏసీ నాయకులు యాదగిరి, బాపురెడి,్డ ప్రభాకర్‌లు మాట్లాడుతూ, తెలంగాణ జేఏసీ ఛైర్మన్‌ కోదండరాంపై కాంగ్రెస్‌ నాయకులు చేస్తున్న విమర్శలు మానుకోవాలని డిమాండ్‌ చేశారు. నిజామాబాద్‌, ఒంగోలు మెడికల్‌ కళాశాలల పనులు ఒకేసారి ప్రారంభం కాగా ఒంగోలులో భవనం పనులు పూర్తయినా, నిజామాబాద్‌లో పనులు నిర్వహించేందుకు అనుమతి ఎందుకు లభించలేదని వారు ప్రశ్నించారు. ప్రభుత్వం 300 మెడికల్‌ సీట్లు మంజూరు చేయగా, వాటిని కాంగ్రెస్‌ నాయకులు ఆంధ్రకు తరలించుకుపోతే నోరు మెదపని తెలంగాణ నాయకులు నిర్లక్ష్యం ఏ పాటిదో తెలుస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు వచ్చే సీట్లను, హక్కులను రప్చించుకోవాలని తెలంగాణ ప్రజలను వారు కోరారు.