టీఆర్‌ఎస్‌కు ఓటేయండి.. అభివృద్ధికి పట్టం కట్టండి!
– మంత్రులు కేటీఆర్, హరీశ్
ఖమ్మం,మే12(జనంసాక్షి): తెలంగాణ అభివృద్ధి తెరాసతోనే సాధ్యమని మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు అన్నారు. ఖమ్మం జిల్లా పాలేరు ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుమలాయపాలెం మండలం బచ్చోడుతో గురువారం రాత్రి బహిరంగసభ నిర్వహించారు. ఈ సభకు మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు, పలువురు తెరాస ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ… పాలేరులో కాంగ్రెస్, తెదేపా, వైకాపా అప్రజాస్వామిక పొత్తుకు తెరతీశాయని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టుల పేరుతో ప్రజల పట్ల కపటప్రేమ ప్రదర్శించిందని ఆరోపించారు. ఇప్పుడు అప్రజాస్వామికమైన పొత్తుతో ప్రజలను మభ్యపెడుతోందన్నారు. పాలేరులో తెరాసకు పట్టం కట్టి అభివృద్ధికి ప్రజలందరూ వూతమివ్వాలని కోరారు.తెరాస ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రజలకు అందిస్తోందని… వాటి అమలు తీరును పక్క రాష్ట్రాలు కూడా గమనిస్తున్నాయని మంత్రి హరీశ్‌రావు అన్నారు. పాలేరు కరవుతో అల్లాడేందుకు కాంగ్రెస్ నాయకులే కారణమని ఆరోపించారు. దశాబ్దాల పాటు కాంగ్రెస్ పాలించినా ఏమాత్రం అభివృద్ధి జరగలేదన్నారు. ప్రజలు అడగకపోయినా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ బంగారు తెలంగాణ కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఉపఎన్నికలో తెరాసను గెలిపింది అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.