టీజేఏసీతో కలిసి ఉద్యమించడానికి సీపీఐ

టీజేఏసీ ‘తెలంగాణ మార్చ్‌’లో కదంతొక్కనున్న కామ్రేడ్లు
సీపీఐ ‘తెలంగాణ పోరు యాత్ర’కు తరలిరానున్న తెలంగాణవాదులు
సీపీఐ ప్రధాన కార్యాలయంలో ఇరుపక్షాల భేటీ
కలిసి కొట్లాడుతాం.. తెలంగాణ సాధిస్తాం
ప్రత్యేక రాష్ట్రాన్ని ఏ శక్తీ ఆపలేదు
ముక్తకంఠంతో నినదించిన ‘సీపీఐ’ నారాయణ, ‘టీజేఏసీ’ కోదండరాం
హైదరాబాద్‌, ఆగస్టు 16 (జనంసాక్షి) : ఇంతకాలం తెలంగాణ ఏర్పాటుకు సుముఖతను తెలిపిన సీపీఐ, టీజేఏసీతో మాత్రం కలిసిరాలేదు. కానీ, అనూహ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఊపందుకున్న నేపథ్యంలో సీపీఐ టీజేఏసీతో జతకట్టి తెలంగాణ సాధనలో మమేకం కావడానికి సిద్ధమైంది. ఈ ప్రకటన చేసేందుకు తమ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయాన్నే వేదిక చేసుకుంది. గురువారం హైదరాబాద్‌లోని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ టీజేఏసీతో సమన్వయ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి సీపీఐ నాయకులతోపాటు టీజేఏసీ, ఉద్యోగ సంఘాల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇరుపక్షాలు తెలంగాణ ఉద్యమ ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు. ఐదు గంటలపాటు సాగిన ఈ సమావేశం అనంతరం ఇరువర్గాలు మీడియా మాట్లాడాయి. టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఏ శక్తీ ఆపలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం ధీమా వ్యక్తం చేశారు. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంపై సీపీఐ సభ్యులతో ఆరోగ్యకరమైన చర్చలు జరిపామని తెలిపారు. ఈ నెల 25 నుంచి వచ్చే నెల 3 వరకు సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టనున్న ‘తెలంగాణ పోరు యాత్ర’కు తాము సంపూర్ణ మద్దతిస్తున్నా మని, ఆ యాత్రలో పాల్గొని విజయవంతం చేస్తామని కోదండరాం తెలిపారు. ప్రజా ఉద్యమాల చరిత్రలో ప్రపంచ చరిత్రలో చెరిగిపోని అధ్యాయంగా సెప్టెంబర్‌ 30న ‘తెలంగాణ మార్చ్‌’ను నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ సీపీఐ, టీజేఏసీ మధ్య సమన్వయం రాష్ట్ర ఏర్పాటు వరకు కొనసాగుతుందన్నారు. ప్రజాప్రతినిధులంతా పార్టీలకతీతంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. వచ్చే నెల 30న జేఏసీ నిర్వహించనున్న ‘తెలంగాణ మార్చ్‌’కు సీపీఐ సంఘీభావం ఉంటుందని, తాము మార్చ్‌లో పాల్గొని విజయవంతం చేస్తామన్నారు. అంతే కాకుండా, మార్చ్‌కు ముందు తాము చేపడుతున్న పోరు యాత్రలోనూ మార్చ్‌పై ప్రజలకు అవగాహన కలిగిస్తామని నారాయణ వెల్లడించారు. పోరుయాత్ర ద్వారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై రోడ్‌ మ్యాప్‌ ప్రకటించాలని కేంద్రంపై ఒత్తిడి పెంచుతామని ఆయన వివరించారు. సెప్టెంబర్‌ 30 లోపు తెలంగాణ అంశంపై కాంగ్రెస్‌, టీడీపీ స్పష్టమై వైఖరిని తెలపాలని సీపీఐ, టీజేఏసీ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులు స్వామిగౌడ్‌, దేవీప్రసాద్‌, శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సీపీఐ ప్రత్యేక రాష్ట్ర పోరును ఉధృతం చేయడం హర్షణీయమన్నారు. తమ సంఘాలు తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడూ ముందున్నాయని, ఇక ముందు కూడా క్రియాశీలక పాత్ర పోషిస్తాయని స్పష్టం చేశారు. సీపీఐ ‘తెలంగాణ పోరు యాత్ర’కు, టీజేఏసీ ‘తెలంగాణ మార్చ్‌’కు తమ పూర్తి మద్దతు ఉంటుందని వారు వెల్లడించారు. ఇదిలా ఉంటే, తెలంగాణ సాధన ఉద్యమంలో టీజేఏసీతో సీపీఐ మద్దతిచ్చి, కలిసి రావడంపై తెలంగాణవాదులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మిగతా పార్టీలు టీజేఏసీతో కలిసి ఉద్యమించాలని కోరుతున్నారు.