టీడీపీకి షాక్‌!

– వైసీపీలోకి వెళ్లనున్న చల్లా రామకృష్ణారెడ్డి
– టీడీపీ సభ్యత్వానికి, కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవికి రాజీనామా
– త్వరలో జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరిక
కర్నూలు, మార్చి4(జ‌నంసాక్షి) : టీడీపీకి కర్నూలు జిల్లాలో షాక్‌ తగిలింది. సీనియర్‌ నేత, రాష్ట్ర సివిల్‌ సప్లై కార్పొరేషన్‌ చైర్మన్‌ చల్లా రామకృష్ణారెడ్డి పార్టీకి సోమవారం రాజీనామా చేశారు. పార్టీ సభ్యత్వం, సివిల్‌ సప్లై కార్పొరేషన్‌ పదవులకు రాజీనామా చేస్తూ చంద్రబాబుకు లేఖ పంపారు. చల్లా త్వరలోనే వైసీపీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో జగన్‌ను కలిసి వైసీపీ కండువా కప్పుకోబోతున్నట్లు అనుచరులు చెబుతున్నారు. కర్నూలు జిల్లాలో చల్లా రామకృష్ణారెడ్డికి సీనియర్‌ నేతగా మంచి పేరుంది. రెండు మూడు నియోజకవర్గాల్లో కేడర్‌ కూడా ఉంది. చల్లా కోవెలకుంట్ల, బనగానపల్లి నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పలుమార్లు గెలుపొందారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్‌ను వీడి టీడీపీలో చేరారు. సరిగ్గా ఎన్నికల ముందు చల్లా రామకృష్ణారెడ్డి టీడీపీని వీడటం పార్టీకి ఎదురు దెబ్బేనంటున్నారు. కొద్దిరోజులుగా అధిష్టానం తీరుపై చల్లా అసంతృప్తితో ఉన్నారు. గతంలో ఆర్టీసీ రీజినల్‌ ఛైర్మన్‌ పదవి ఇవ్వడంపై అసహనం వ్యక్తం చేశారు. దీంతో చల్లాకు సివిల్‌ సప్లై కార్పొరేషన్‌ పదవిని కట్టబెట్టారు. తాజాగా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత టీడీపీలో చేరేందుకు సిద్ధంకావడంతో.. రామకృష్ణారెడ్డి
అసంతృప్తిగా ఉన్నారట. చల్లా రామకృష్ణారెడ్డి సొంత నియోజకవర్గమైన బనగానపల్లిలో టీడీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్‌ రెడ్డి ఉన్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేను కాదని.. చల్లాకు టికెట్‌ ఇచ్చే అవకాశం లేదు. అందుకే వైసీపీ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. వైసీపీ తరపున బనగానపల్లి నుంచి బరిలోకి దిగాలనే ఆలోచనలో ఉన్నారని ఆయన అనుచరులు పేర్కొంటున్నారు. 2014లో కాటసాని రామిరెడ్డి వైసీపీ నుంచి పోటీచేసి ఓడారు.