ట్రిపుల్‌ ఐటీలో ప్రవేశ ఫలితాలు వెల్లడి

హైదరాబాద్‌, జూలై 15 (జనంసాక్షి) : ట్రిపుల్‌ ఐటీ ప్రవేశ ఫలితాలను ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఆదివారం మధ్యాహ్నం 12గంటలకు గచ్చిబౌలిలో విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ 49.7 శాతం మంది బాలికలు, 50.3శాతం మంది బాలురు ఎంపికైనట్టు చెప్పారు. ఈ నెల 26, 27 తేదీల్లో కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్టు తెలిపారు. అంతేగాక ఈ నెల 29న రెండో దశ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని చెప్పారు. తరగతులు ఈ నెల 30వ తేదీ నుంచి ప్రారంబ మవుతాయన్నారు. కౌన్సెలింగ్‌ రాష్ట్రంలోని బాసర, ఇడుపులపాయ, నూజివీడులలో జరగనున్నట్టు వివరించారు. 1800 కోట్ల రూపాయలతో దశలవారీగా ట్రిపుల్‌ ఐటీల్లో మౌలిక వసతులు కల్పించనున్నట్టు తెలిపారు. అలాగే బోధనా సిబ్బందిని నియమిస్తామని హామీ ఇచ్చారు.