డిస్మిస్‌కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి

భూపాలపల్లి, మే 21, (జనంసాక్షి) : వివిధ కారణాల చేత ఉద్యోగాలు కోల్పోయి నడిరోడ్డున పడి అవస్థలు పడుతున్న డిస్మిస్‌ కార్మికులను వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకోవాలని సొసైటి అఫ్‌ బ్లాక్‌ కోల్‌ వర్కర్స్‌ యూనియన్‌ అద్యక్షుడు ఘంటా సత్యనారయణరెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక కాకతీయ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వారికున్న కుటుంబ పరిస్థితుల మూలంగా, వివిధ ఆనారోగ్య కారణాల చేత విధులకు హాజరు కాని డిస్మిస్‌కార్మికులు వారి కుటుంబాలను పోషించుకోలేని దుస్థితి వచ్చిందన్నారు, ఎన్నో రకాల కౌన్సిలింగ్‌లని ఏర్పాటు చేసిన యాజమాన్యం ఇంతవరకు వారిని కనికరించడం లేదని పేర్కొన్నారు. వేరే పనులు చేసుకోలేక వారు అనేక ఇబ్బందులకు గురౌతున్నారని తెలిపారు. హైపర్‌కమిటి పేరుతో యాజమాన్యం డిస్మిస్‌ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు అనేక ఆటంకాలను సృష్టిస్తుందని ఆరోపించారు. ఇకనైనా యాజమాన్యం వారిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని లేనియెడల ఉద్యమాల ద్వారా సాధించుకుంటామని స్పష్టం చేశారు. మెడికల్‌ ఫిట్‌ అయిన ప్రతి కార్మికున్ని విధుల్లోకి తీసుకోవాలని మిగిలిన వారికి రూ. 8 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో డిస్మిస్‌ కార్మిక సంఘం రాష్ట్ర అద్యక్షుడు బుర్ర సారయ్య, నాయకులు నారాయణ, శాంతయ్య, శ్రీనివాస్‌, ప్రభాకర్‌, ఫకృద్ధీన్‌ తదితరులు పాల్గొన్నారు.