డ్రగ్‌స్టోర్‌లోని మందులనే కొనాలి : సీఎం

ఖమ్మం, ఆగస్టు 10 (జనంసాక్షి): వైద్యులు రాసే మందులు డ్రగ్‌ స్టోరు ద్వారానే సరఫరా కావాలని ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. ఇందిరమ్మబాటలో భాగంగా మూడో రోజైన శుక్రవారంనాడు స్థానిక ప్రభుత్వాసుపత్రి ఆవరణలో 217 కోట్ల రూపాయలతో నిర్మించిన సెంట్రల్‌ డ్రగ్‌స్టోర్‌ భవనాన్ని ప్రారంభించారు. బైపాస్‌ రోడ్డులో 1.15 కోట్ల రూపాయలతో నిర్మించనున్న భూగర్భ జలశాఖ భవనానికి కూడా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఆరోగ్యశ్రీ రోగుల కోసం ఏర్పాటు చేసిన పురుషుల, స్త్రీల వార్డులను ప్రారంభించారు. ఈ సందర్భాలలో సిఎం మాట్లాడుతూ డ్రగ్‌స్టోరులోనే మందులను కొనుగోలు చేయాలని రోగులకు సూచించారు. వాటిని ఆన్‌లైన్‌లో ఉంచడం జరుగుతుందన్నారు. మందులు రాసిచ్చిన వైద్యులు బయట కొనాలని చెబితే అట్టి వారిపై తనకు ఫిర్యాదు చేయాలని సూచించారు. అట్టి వారిపై చర్యలు తీసుకుంటానన్నారు. పేద వర్గాలకు వైద్యం అందించేందుకు గాను ఈసారి బడ్జెట్‌లో అదనంగా 200 కోట్ల రూపాయలు కేటాయించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు రాంరెడ్డి వెంకట్‌రెడ్డి, కొండ్రు మురళి, ఉప సభాపతి భట్టి విక్రమార్క, పార్లమెంటు సభ్యులు బలరాం నాయక్‌, రేణుకా చౌదరీ, శాసన మండలి సభ్యులు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, బాలసా లక్ష్మీనారాయణ, పోట్ల నాగేశ్వరరావు, శాసన సభ్యులు తుమ్మల నాగేశ్వరరావు, రేగా కాంతారావు, మిత్ర సేన పాల్గొన్నారు. అలాగే జిల్లా కలెక్టర్‌ సిద్ధార్థ జైన్‌, ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్యామలారావు,చీఫ్‌ఇంజనీర్‌ ప్రభాకర్‌రావు,ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ఆనందరాణి తదితరులు పాల్గొన్నారు.