డ్రిప్‌ ఇరిగేషన్‌తో రైతులకు లాభాలు!

కరీంనగర్‌, జూన్‌ 27 : సాంప్రదాయక సాగు పద్దతులలో పంటు వేసి ఆశించిన దిగుబడులు రాక ఇబ్బందులు పడిన రైతులు ఆధునిక వ్యవసాయ పద్దతుల వైపు ఆకర్షితులు కావడం సహజం. పెట్టుబడి ఖర్చులు అధికమవుతున్న నేటి తరుణంలో, వర్షాభావ పరిస్థితుల కారణంగా ఉన్న కొద్ది పాటి నీటిని సద్వినియోగ పర్చుకొని పంటలు ఎలా వేయాలనే దిగులు పడుతున్న రైతులకు ఇదితో నేనున్నానంటూ మైక్రో ఇరిగేషన్‌ వారికి ఆసరగా నిలుస్తోంది. తక్కువ పెట్టుబడి ఖర్చు, తక్కువ నీరుతో పంటలు సాగుచేసే విధానమే మైక్రో ఇరిగేషన్‌, ఇందులో డ్రిప్‌ ఇరిగేషన్‌, స్పింక్లర్‌ ఇరిగేషన్‌ అని రెండు రకాలుగా ఉంటుంది. డ్రిప్‌ ఇరిగేషన్‌ చేస్తూ జిల్లాలోని ఇరువువు రైతులు లాభాలు గడిస్తున్నారు. వారి వివరాలు తెలుసుకుందాం. కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలం నల్గొండ గ్రామానికి చెందిన రైతు గాండ్ల శ్రీనివాస్‌కు 28గంటల భూమి ఉంది. ఉన్న కొద్ధి పాటి భూమికి సరైన నీటి వసతి, అధిక ఆర్థిక స్తోమత లేకపోవడంతో వరి వంటి పంటలు వేయలేకపోయాడు. అధికారుల ద్వారా డ్రిప్‌ గురించి తెలుసుకొని ఆ పద్దతిలో సాగు చేసుకొనేందుకు ముందుకు వచ్చాడు. వ్యవసాయ శాఖ, మైక్రో ఇరిగేషన్‌ అధికారుల సలహా తీసుకొని పచ్చిమిర్చి పంట వేయాలని నిర్ణయించుకొన్నాడు. ఇందుకు డ్రిప్‌ ఇరిగేషన్‌ పద్దతిని పాటించాలని డిసెంబర్‌ 2010లో దరఖాస్తు చేసుకొన్నాడు. అధికారులు రైతు శ్రీనివాస్‌కు డ్రిప్‌ పరికరాలను మంజూరు చేశారు. వీటిని అమర్చుకొని పచ్చిమిర్చి వేశాడు. 6 నెలల వ్యవధిలో 6 నుంచి 7 టన్నుల పచ్చిమిర్చి దిగుబడి వచ్చింది. ఒక టన్నుకు 13వేల రూపాయల ఆదాయం వచ్చింది. అలా మొత్తం 91వేల రూపాయల ఆదాయం పొందాడు. అతనికి సాగు చేసేందుకు అయిన ఖర్చు కేవలం 31వేల రూపాయలు మాత్రమే ఇవిపోన అతనికి 60వేల రూపాయల లాభం వచ్చింది. డ్రిప్‌ పద్దతిలో సాగు చేయక పూర్వం అతనికి కేవలం 3టన్నుల దిగుబడి మాత్రమే వచ్చేది. అలాగే కాలువల ఆధారంగా నీరు పొందేవాడు. కానీ డ్రిప్‌ పద్దతిలో సాగు చేయడం వలన దిగుబడి గణనీయంగా పెరిగింది. పచ్చిమిర్చితో పాటు మొక్కజొన్న పంట వేసి 30 క్వింటాళ్ల దిగుబడిని పొందాడు. ఇబ్రహీంపట్నం మండలం కేంద్రానికి చెందిన తీగల అశోక్‌రెడ్డి కూడా డ్రిప్‌ పద్దతిని పంట సాగు చేస్తూ అధిక లాభం పొందాడు. డ్రిప్‌ పద్దతికి పూర్వం అశోక్‌రెడ్డి అవసరమైన నీటి లభ్యత లేక పసుపు పండించేందుకు ఇబ్బంది పడేవాడు. పసుపు గడ్డ తయారయ్యే దశలో నీరు అందక ఎండిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్‌ మైక్రో ఇరిగేషన్‌ ప్రాజెక్టు అధికారులు కలిగించిన అవగాహనతో స్పూర్తి పొంది డ్రిప్‌ కొరకు దరఖాస్తు చేశాడు. తనకున్న 42 గుంటల స్థలంలో డ్రిప్‌ పరికరాలు అమర్చుకొనుటకు తనవాటా కింద 5555 రూపాయలను చెల్లించి 90 శాతం రాయితీతో డ్రిప్‌ను పొందాడు. అందుబాటులో నున్న నీటిని వినియోగించుకొని డ్రిప్‌ ద్వారా పనుసు పంట సాగు చేశాడు. ఫలితంగా 27 క్వింటాళ్ల పసుపు దిగుబడివచ్చింది. ఇంత క్రితం అతనికి కేవలం 18 క్వింటాళ్లు మాత్రమే వచ్చేది. కలుపు నివారణకు అయ్యే ఖర్చు కూడా డ్రిప్‌లో చాలా తగ్గింది. పసుపు పంటకు ఖర్చుల రుపేణా 61వేల రూపాయలను అశోక్‌రెడ్డి భరించాడు. కాగా మొత్తం పంట దిగుబడి రూపేణా అతనికి 1,51,200 రూపాయలు లభించాయి. నికరంగా అతనికి కలిగిన ప్రయోజనం 90,200రూపాయలు ఈ విధంగా రైతులు మైక్రో ఇరిగేషన్‌ పద్దతిలో సాగుచేసి లాభాలు పొందవచ్చు వివరాలకు కలెక్టరేట్‌లోని ఆంధ్రప్రదేశ్‌ మైక్రో ఇరిగేషన్‌ ప్రాజెక్టు కార్యాలయంలో ఆసక్తిగల రైతులు సంప్రదించవచ్చును.