తల్లిబిడ్డల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
సంగారెడ్డి, నవంబర్ 9 (): తల్లిబిడ్డల సంక్షేమం కోసం ఒక్కపూట పౌష్ఠికాహారం కలిగిన భోజనం ఇచ్చే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి వి.సునితారెడ్డి తెలిపారు. శుక్రవారంనాడు నర్సాపూర్ మండల పరిధి నారాయణపూర్ గ్రామంలో మంత్రి ప్రారంభించారు. రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా మూడు జిల్లాలను ఎంపిక చేసి అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. మెదక్ జిల్లాతో పాటు కర్నూలు, విశాఖపట్నం జిల్లాలో ఈ పథకం ప్రారంభించినట్లు సునితారెడ్డి తెలిపారు. మహిళా సంక్షేమం కోసం ఐసిడిఎస్ ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. పౌష్టికాహారలోపంతో గర్భిణిలు, జన్మించిన శిశువులు మృతి చెందడంపై ప్రభుత్వం కలత చెంది ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిందని తెలిపారు. పై మూడు జిల్లాల్లో వచ్చే ఫలితాల ఆధారంగా ఇతర జిల్లాలకు విస్తరించే కార్యక్రమాన్ని ఆలోచిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ బివివిఎస్ మూర్తి, పిడిడిఆర్ డిఎ రవీందర్, నర్సాపూర్ ప్రత్యేకాధికారి బాల్‌రెడ్డి, జిల్లా వైద్యాధికారి రంగారెడ్డి, మాజీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.