తల్లులందరూ గొప్పోల్లే.. కానీ..

సంపాదకీయం..

‘ఓ తల్లికి చాలా ఏళ్లకు కొడుకు రూపంలో సంతానం కలుగుతుంది. లేక లేక కలిగిన పుట్టిన ఆ బిడ్డను ఆ తల్లి అల్లారు ముద్దుగా చూసుకుంటుంది. ఆ చిన్నారి ఏదడిగినా కాదనకుండా ఇస్తుంది. తన మాతృత్వం నీడలో అతడి కాలుకందకుండా పెంచి పెద్ద చేస్తుంది. అందరిలాగే ఆ బుడతడు కూడా యుక్త వయస్సుకు వస్తాడు. ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. ఎంతగా అంటే ఆ అమ్మాయి లేకుండా బతుకలేని స్థితికి చేరుకుంటాడు. ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుంటాడు. ఇదే ప్రస్తావనను తన ప్రేయసి ముందుంచుతాడు. ఆ ప్రేయసి తన ప్రియుడు తనను ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసుకుందామని, ఓ పరీక్ష పెట్టాలకుంటుంది. ఇందులో భాగంగానే ఆ యువకుడితో ‘నువ్వు నీ తల్లి గుండెను నాకు బహుమతిగా ఇస్తేనే, నేను నీతో పెళ్లాడుతాను’ అని షరతు పెడుతుంది. పూర్తిగా ఆ యువతి ప్రేమ మత్తులో ఉన్న ఆ యువకుడు తన ప్రేయసి షరతుకు ఒప్పుకుని అక్కడి నుంచి బయలుదేరతాడు. నేరుగా ఇంటికి చేరుకుని తల్లికి తన ప్రేయసి పెట్టిన పరీక్ష గురించి చెబుతాడు. దీనికి ఆ తల్లి ఏ మాత్రం ఆలోచించకుండా, తన కొడుకు కోరిక తీర్చడానికి గుండెను కోసి అతడి చేతిలో పెట్టి చనిపోతుంది. ప్రేయసి మోహంలో ఉన్న ఆ యువకుడు తల్లి శవాన్ని వదిలేసి, ఆమె ఇచ్చిన గుండెను చేతిలో పట్టుకుని ప్రేయసి దగ్గరికి పరుగు పరుగున బయలుదేరతాడు. తల్లి గుండెను ప్రేయసికిచ్చి, ఆమెను వెంటనే పెళ్లి చేసుకోవాలన్న తొందర్లో పరుగు వేగాన్ని పెంచుతాడు. అలా పరిగెడుతూ ఓ చోట కాలికి రాయి తగిలి కింద పడిపోతాడు. ఆ యువకుడి చేతిలో తల్లి గుండె పక్కకు పడిపోతుంది. అతడేమో బాధతో ‘అమ్మా..’ అంటూ బాధతో అరుస్తుంటాడు. అతడి బాధను భరించలేక పక్కనే పడి ఉన్న నిర్జీవమైన అతడి తల్లి గుండెలో జీవమొచ్చి ‘నెమ్మదిగా లేవు నాన్నా.. ఏమీ కాదులే..’ అని ఆ కర్కష కొడుకును ఓదారుస్తుంది. అప్పుడు ఆ యువకుడికి తన తప్పు తెలిసి వస్తుంది. ఓ ‘అమ్మ’ తన బిడ్డను ఎంతగా ప్రేమిస్తుందో చెప్పడానికి ఈ కథ కన్నా మంచి ఉదాహరణ ఉండదు. అమ్మ మనసు అంతే, కొడుకు ఎలాంటి వాడైనా, తల్లి చూపించే మమత ఇసుమంతైనా తగ్గదు, తరగదు. ‘కాకి పిల్ల కాకికి ముద్దు’ అన్న సామెత ఊరికెనే పుట్ట లేదు గదా ! అలాగే, వైఎస్‌ విజయమ్మ కూడా తన కొడుకు జగన్‌ ఎంత అవినీతికి పాల్పడినా, అతడిపై ప్రేమ, సానుభూతి, మమత చూపించడంలో ఆశ్చర్యం లేదు. కానీ, అక్రమాస్తుల కేసు విచారణలో భాగంగా జగన్‌ జైలులో ఉంటే, అతడేదో లోక కల్యాణం కోసం జైలుకెళ్లినట్లు ప్రచారం చేయడమే సమంజసంగా అనిపించడం లేదు. యావత్‌ దేశం విస్తుపోయేలా ఆర్థిక కుంభకోణాలకు పాల్పడి, కోటాను కోట్ల ప్రజాధనాన్ని తన తాతముత్తాతల ఆస్థిలా బొక్కేసిన తన కొడుకు జగన్‌ ఓ వారం నుంచి జైలులో ‘బతుకుతుంటేనే’ విజయమ్మ అంతగా తల్లడిల్లిపోయి వేల మంది జనం ముందు కన్నీరు కారుస్తోంది. మరి ఓ యాదయ్య ఒంటికి నిప్పంటించుకుని ట్యాంక్‌బండ్‌పై పరుగెత్తీ పరుగెత్తీ ప్రాణాలు వదిలేస్తుంటే, ఓ యాదిరెడ్డి పార్లమెంటు ఎదురుగా ఉరికొయ్యకు ఊగుతుంటే, ఈ దృశ్యాలు టీవీల్లో చూసిన వాళ్ల తల్లుల గుండెకోత, అలాంటి ఎనిమిది వందల తల్లుల కడుపుకోత ఓ తల్లిగా విజయమ్మకు తెలియదంటే నమ్మలేము. తెలంగాణలో జరిగిన ఈ శారీరక, మానసిక ఊచకోతకు ఆజ్యం పోసిన వారిలో విజయ్మ కొడుకు జగన్‌తోపాటు ఆమె భర్త వైఎస్‌ రాజశేఖరరెడ్డిదే సింహభాగం. వారు చేసిన వ్యాఖ్యలు, తీసుకున్న చర్యలే అందుకు కారణం. పుట్టిన గడ్డనే తల్లిగా భావించి, ఆ ‘తల్లి’ విముక్తి కోసం చేసే యజ్ఞానికి తమ ప్రాణాలను సమిధలుగా సమర్పించిన ఎనిమిది వందల బిడ్డల కన్నా జగన్‌ గొప్పవాడా ? ఇది విజయమ్మే ఓ తల్లిగా ఆలోచించి నిర్ణయించుకోవాలి. ఆ నిర్ణయం కచ్చితంగా ఎనిమిది వందల తల్లుల గుండెకోతకు ఉపశమనాన్ని ఇవ్వాలి. ఈ సంఘటనకు పరకాల వేదిక కావాలి. విజయమ్మ పరకాలకు రావడానికి ముందే తన నిర్ణయాన్ని ప్రకటించాలి. ప్రకటించాకే పరకాలకు రావాలి.