‘తూర్పు’న మూడు రోజులు పర్యటించనున్న సి.ఎం కిరణ్‌

గిరిజనులు, ఎస్సీలు, మత్స్యకారులతో భేటీ
కాకినాడ,జూలై10(ఎపిఇఎంఎస్‌): రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈనెల 12,13,14 తేదీల్లో తూర్పుగోదావరి జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన గిరిజనులు, ఎస్సీలు, మత్స్యకారులతో మమేకమవడానికి పక్కా ప్రణాళికను సిద్దం చేశారు. ఈ మూడు రోజుల పర్యటనలో ప్రజా సమస్యలపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించనున్నరు. ఈ పర్యటనలో భాగంగా ఈనెల 12వ తేదీ న ఆయన ముందుగా గోకవరం నుంచి పర్యటన ప్రారంభిస్తారు. స్థానికంగా అక్కడ ఉన్న ఉపాధిహామీ పనులు పరిశీలించి కూలీలతో మాట్లాడి వారి కష్టసుఖాలు తెలుసుకుంటారు. అనంతరం రంపచోడవరం వెళ్లి భూపతిపాలెం ప్రాజెక్టును జాతికి అంకితం చేసి ఐటిడిఎ కార్యాలయంలో అధికారులతో ఏజెన్సీలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షలు నిర్వహిస్తారు. అనంతరం 12వ తేదీ రాత్రి సమీపంలో గల ఒక గిరిజన తండాకి వెళ్లి తండాలో సహపంక్తి భోజనం చేసి రాత్రికి అక్కడే బస చేస్తారు. 13వ తేదీ ఉదయం 9గంటలకు రంపచోడవరం నుంచి బయలుదేరి అమలాపురం డివిజన్‌లో బండారులంక వెళ్లి అక్కడ చేనేత కార్మికులతో వారి సమస్యలపై భేటీ అవుతారు. అమలాపురంలో ఉన్న టిటిడిసిలో రాజీవ్‌ యువకిరణాల శిక్షణా కేంద్రాన్ని పరిశీలించి స్థానికులకు కలుగుతున్న ఉపాధి అవకాశాలపై సమీక్ష నిర్వహిస్తారు. తరువాత కోనసీమ పరిరక్షణ సమితి సభ్యులతో సమావేశమవుతారు. కిమ్స్‌ ఆసుపత్రిలో ఆర్యోశ్రీ రోగులను పరామర్శిస్తారు. అమలాపురం, ముమ్మిడివరం నియోజకవర్గంలో ఎస్సీ కాలనీలను సందర్శించి సహపంక్తి భోజనం చేస్తారు. పంట విరామం ప్రకటించిన రైతులతో కూడా ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు. రాత్రికి కాకినాడ చేరుకుని కాకినాడలో బస చేస్తారు. 14వ తేదీన కలెక్టరేట్‌లో తూర్పుగోదావరి జిల్లాలో అధికారులపై సమీక్ష నిర్వహించిన అనంతరం పాత్రికేయుల సమావేశంలో పాల్గోంటారు. తరువాత తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయాన్ని సందర్శిస్తారు. ఈ సందర్భంగా 14వ తేదీన కాకినాడలో ఉన్న మత్స్యకార ప్రాంతంలో మత్స్యకారులతో సహపంక్తి భోజనం చేయడానికి ప్రణాళికలు సిద్దమయ్యాయి. సిఎం తూర్పుగోదావరిజిల్లా నుంచే జిల్లాల టూర్‌లకు శ్రీకారం చూడుతున్నారు. ఈ టూర్‌లలో ఇటువంటి సహపంక్తి భోజనాల పేరిట రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా కార్యక్రమాలను రూపోందించారు.