తెదేపాలోనే బిసిలకు సముచితస్థానం

గుంటూరు, జూలై 16 : బిసిలకు సముచిత స్థానం కల్పించింది తెదేపా అని పార్టీ జిల్లా అధ్యక్షుడు పత్తిపాటి పుల్లారావు అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులతో ఆయన సోమవారం సమావేశమయ్యారు. బిసిల అభ్యున్నతికి వైఎస్‌ కుటుంబం వ్యతిరేకి అన్న విషయం జగమెరిగిన సత్యమని పత్తిపాటి స్పష్టం చేశారు. వైఎస్‌ తండ్రి రాజారెడ్డి హయాంలో చేయించిన హత్యల్లో బిసిలే ఎక్కువ మంది చనిపోయారని గుర్తు చేశారు. బిసిలకు కాంగ్రెస్‌, వైఎస్‌ హయాంలో జరిగిన మేలు గురించి బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. తెదేపా రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో చేసిన బిసి డిక్లరేషన్‌తో కాంగ్రెస్‌, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నాయకుల వెన్నులో వణుకు ప్రారంభం మైందన్నారు. టిడిపిపై బురదజల్లడం హేయమైన చర్య అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ప్రవేశపెట్టిన వైఎస్‌ తన హయాంలో 1400 కోట్లు బకాయిలు పెట్టారన్నారు. సిఎం కిరణ్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద 26 వేల కోట్లు ఇచ్చామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. 2008-09లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద విడుదల చేసింది 1485 కోట్లు మాత్రమేనని, లేని ఘనత ఆపాదించుకోవడం దుర్మార్గమన్నారు. బిసిలకు తెలుగుదేశం ప్రకటించిన డిక్లరేషన్‌పై గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు వివిధ రూపాల్లో ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు. మంత్రులకు రాజ్యాంగపై విశ్వాసం లేనప్పుడు సామాన్య ప్రజలకు ఎలా ఉంటుందని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ప్రశ్నించారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు రాజనారాయణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.