దేశవ్యాప్తంగా హెచ్‌పీవీ వ్యాక్సినేషన్..
` ప్రారంభించిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ(జనంసాక్షి):దేశవ్యాప్తంగా హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభమైంది శనివారం రాజస్థాన్‌లో అజ్‌మేర్‌లో ప్రధాని నరేంద్రమోదీ దీనిని ప్రారంభించారు. మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌తో పాటు, నివారించదగిన మరికొన్ని రకాల క్యాన్సర్లను అరికట్టడమే లక్ష్యంగా కేంద్రం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులోభాగంగా 14 సంవత్సరాల బాలికలకు ‘గార్డాసిల’ అనే టీకాను ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఈ వ్యాక్సిన్ హెచ్‌పీవీ టైప్ 16, 18తో పాటు టైప్ 6, 11 రకాల నుంచి రక్షణ కల్పించనున్నట్లు కేంద్రం తెలిపింది. గర్భాశయ క్యాన్సర్ నివారణకు ప్రపంచస్థాయి వ్యూహంలో భాగంగా హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ చేపట్టాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన సిఫార్సు మేరకు కేంద్రం దీనిని ప్రారంభించింది. ప్రతి ఏటా 1.15 కోట్ల వ్యాక్సిన్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ వ్యాక్సిన్ 2006లో అందుబాటులోకి రాగా.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 50 కోట్ల డోసులు పంపిణీ చేశారు. దీంతో పలు దేశాల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లు గణనీయంగా తగ్గినట్లు అంచనా. 160 దేశాల్లో ఇప్పటికే ఈ టీకా పంపిణీ కార్యక్రమం అమల్లో ఉండగా.. వీటిలో 90 దేశాలు సింగిల్ డోసులు అందిస్తున్నాయి. ప్రపంచంలో క్యాన్సర్ బాధితుల సంఖ్యాపరంగా చైనా, అమెరికా తర్వాత భారత్ మూడో స్థానంలో ఉంది. 2040 నాటికి దేశంలో క్యాన్సర్ రోగుల సంఖ్య ఏటా 20 లక్షలకు చేరే అవకాశం ఉందని అంచనా. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏటా 2 కోట్ల మంది క్యాన్సర్ బారిన పడుతుండగా.. వీరిలో 15 లక్షల మంది భారతీయులే ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.


