అమెరికాను కొల్లగొడుతున్న దేశాలకు డబ్బులివ్వాలా..?: ట్రంప్
న్యూయార్క్(జనంసాక్షి):ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్‌లు చెల్లవని అక్కడి సుప్రీంకోర్టు ఇటీవల సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పుపై తాజాగా ట్రంప్ మరోసారి స్పందించారు. సుప్రీం తీర్పుతో విదేశాలకు, కంపెనీలకు పెద్ద మొత్తంలో డబ్బులు తిరిగి చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ట్రూత్ సోషల్‌లో పోస్టు పెట్టారు.‘ఇటీవల సుప్రీం ఇచ్చిన తీర్పు.. ఎన్నో సంవత్సరాలుగా యూఎస్‌ను కొల్లగొడుతోన్న దేశాలు, కంపెనీలకు వందల బిలియన్ డాలర్లు తిరిగి చెల్లించేందుకు దారితీస్తుంది. ఇది అర్థరహితం. న్యాయస్థానం దీన్ని పరిగణనలోకి తీసుకోలేదని నేను బలంగా విశ్వసిస్తున్నా. ప్రపంచం ఇంతకుముందు ఎన్నడూ ఇలాంటి తీర్పును చూడలేదు. ఇది నన్ను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ కేసును తిరిగి విచారించడం సాధ్యమేనా?’ అని ట్రంప్ రాసుకొచ్చారు. ట్రంప్ విధించిన సుంకాలను రద్దు చేస్తూ.. సుప్రీంకోర్టు ధర్మాసనం 6:3 మెజారిటీతో ఇటీవల తీర్పు వెలువరించింది. ఈ తీర్పుపై ట్రంప్ అసహనం వ్యక్తంచేశారు. గతంలో కన్నా ఎక్కువ టారిఫ్‌లు వసూలుచేస్తానంటూ హెచ్చరించారు. ఈ క్రమంలో ప్రపంచ దేశాలపై 15 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. సుంకాలు చెల్లవని సుప్రీం తేల్చిచెప్పింది కానీ.. తిరిగి చెల్లింపుల గురించి ఆ తీర్పులో ప్రస్తావించలేదు.


