కోరిన కోర్కెలు తీర్చే శ్రీ లక్ష్మీనరసింహస్వామి

హోలీ పర్వదినాన కోనాపురంలో జాతర ప్రారంభం…
మొక్కులు చెల్లించుకొనున్న భక్తులు…
చెన్నారావుపేట, మార్చి 3 ( జనం సాక్షి ): చెన్నారావుపేట మండలంలోని కోనాపురం గ్రామ శివారులోని ఊరబోడు గుట్ట పై వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భక్తుల కోరిన కోర్కెలను తీర్చుతున్నాడు. ప్రతి ఏడాది హోలీ పర్వదినం సందర్భంగా గ్రామంలోని ఊరబోడు గుట్టపై శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జాతర అత్యంత వైభోపేతంగా ప్రారంభమవుతుంది. నేడు 3న మంగళవారం హోలీ పర్వదినం రోజున ఉదయం శ్రీ లక్ష్మి నరసింహ స్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మిలకు ప్రత్యేక అభిషేక పూజలను నిర్వహించనున్నారు. అనంతరం పంచామృత అభిషేకాలను చేపట్టనున్నారు. మంగళవారం సాయంత్రం అత్యంత వైభోపేతంగా జాతర ప్రారంభం కానుంది. అలాగే చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి మొక్కులు చెల్లించుకొనున్నారు. అదేవిధంగా గుట్ట చుట్టూ బండ్లు తిరిగే కార్యక్రమం ఉంటుంది. 7వ తేదీన శనివారం రథోత్సవం కార్యక్రమం ఉంటుందని గ్రామ సర్పంచ్ మైదం రాకేష్, ఆలయ ప్రధాన అర్చకులు కసివొజ్జల శ్రీకృష్ణచార్యులు తెలిపారు. గ్రామస్తులతో పాటు చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి మొక్కులు సమర్పించుకోనున్నారు.
జాతరలో ఏర్పాట్లు పూర్తి…
మైదం రాకేష్, సర్పంచ్, కోనాపురం.
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జాతరలో ఏర్పాట్లన్నింటిని పూర్తి చేయించినట్లు కోనాపురం గ్రామ సర్పంచ్ మైదం రాకేష్ తెలిపారు. హోలీ పర్వదినం రోజున జాతర ప్రారంభమవుతుంది. చుట్టుప్రక్కల గ్రామాల నుండి భక్తులు జాతరకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. హోలీ పర్వదినం రోజున సాయంత్రం జాతర ప్రారంభమవుతుంది. అలాగే గుట్ట చుట్టూ బండ్లు తిరిగే కార్యక్రమం కూడా ఉంటుంది. ఇప్పటికే జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు తెలిపారు. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి భక్తులు మొక్కులు చెల్లించుకోవాలని కోరారు.



