తెలంగాణను వెంటనే ఏర్పాటు చేయండి

ఆదిలాబాద్‌, జనవరి 4 (): తెలంగాణ ఏర్పాటు విషయంలో కేంద్రం మరింత జాప్యం చేయకుండా వెంటనే రోడ్డు మ్యాప్‌ను ప్రకటించాలని రాజకీయ ఐకాస నేతలు డిమాండ్‌ చేశారు. ప్రత్యేక తెలంగాణను కోరుతూ ఆదిలాబాద్‌లో చేపట్టిన రిలే దీక్షలు శుక్రవారం నాటికి 1091 రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజల ఆకాంక్ష మేరకు, తెలంగాణ ఏర్పాటు విషయంలో అన్ని పార్టీలు తమ వైఖరిని స్పష్టం చేసినందున కేంద్రం వెంటనే రాష్ట్ర ఏర్పాటును ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. ప్రజల మనోభావాలను గౌరవించకుండా కేంద్రం మరింత జాప్యం చేసినా తెలంగాణ ప్రకటించిక పోయినా కాంగ్రెస్‌ పార్టీ భూస్థాపితం కాకతప్పదని హెచ్చరించారు. ఇప్పటికే ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని భవిష్యత్‌లో ఇలాంటివి జరగకుండా కేంద్రం నిర్ణయం తీసుకోకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్ర తరం చేస్తామని వారు హెచ్చరించారు.