తెలంగాణ ఇస్తే సంబురం..

లేదంటే సంగ్రామం : కేసీఆర్‌
హైదరాబాద్‌, ఆగస్టు 14 (జనంసాక్షి):
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఆగస్టు 15 తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ ప్రకటన చేస్తే సంబరం చేసుకుంటామని, లేదంటే సమరం తప్పదని టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌ తెలిపారు. తనకు కేంద్రంలోని నాయ కుల నుంచి సంకేతాలు అందాయని, దాని ప్రకారం తెలంగాణపై కేంద్రం తప్పకుండా ఓ నిర్ణయం తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. అలా కాకుండా మోసం చేయాలని చూస్తే మళ్లీ ఉద్యమ సెగ చవిచూడక తప్పదని హెచ్చరించారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ జయంతి, స్వామిగౌడ్‌ పదవీ విరమణ కార్యక్రమంలో కేసీఆర్‌ పాల్గొని ప్రసంగించారు., తెలంగాణ ప్రజలకు ఉద్యమాలు కొత్తకాదని, ఈ సారి తెలంగాణ వచ్చే వరకు ఉద్యమం కొనసాగుతుందని కెసిఆర్‌ హెచ్చరిం చారు. తెలంగాణ ప్రజలను మోసం చేస్తే ప్రజలు కేంద్రం మెడలు వంచుతారని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. ఈ దఫా తెలంగాణను సాధించకపోతే ఆంధ్రోళ్లు మనల్ని బతకనివ్వరని తెలిపారు. చరిత్రలో కనీవినీ ఎరగని రీతిలో సకలజనుల సమ్మెను విజయవంతం చేసామని గుర్తుచేశారు. ఆచార్య ఎన్జీరంగా విశ్వవిద్యాల యంలో 70 శాతానికిపైగా సీమాంధ్రులే ఉద్యోగాల్లో ఉన్నారనీ, ఆంధ్రా పాలకులు మోసం చేస్తూనే ఉన్నారనీ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే ఎన్జీ రంగా విశ్వవిద్యాలయ పేరును మారుస్తామని తెలిపారు. ముఖ్యమంత్రికి ప్రాంతీయ వివక్ష లేకపోతే ఈ సారి వీసీ పదవి తెలంగాణ వారికి ఇవ్వాలని సవాల్‌ విసిరారు. తెలంగాణలో పత్తి వ్యవసాయం 90 శాతం తెలంగాణలో ఉంటే పరిశోధనా కేంద్రాలను ఆంధ్రలో పెట్టడం విడ్డూరమని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ వచ్చాక రైతులకు అన్ని రాయితీలను కల్పించి తెలంగాణ సీడ్స్‌ పేరిట విత్తన ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పుతామని ప్రకటించారు. విలీనం తర్వాత తెలంగాణను అన్ని రంగాల్లో నిర్లక్ష్యం చేశారని, తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయానికి, నీటిపారుదలకు పెద్దపీట వస్తామని తెలిపారు.