తెలంగాణ కవాతు సందర్భంగా భారీ బందోబస్తు

హైదరాబాద్‌: ఆదివారం హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్‌లో జరగనున్న తెలంగాణ కవాతు సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. శుక్రవారం రాత్రే హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి. డీజీపీ దినేష్‌రెడ్డి, నగర పోలీసు కమిషనర్‌ అనురాగ్‌శర్మ తదితరులు కవాతు నిర్వహించే నెక్లెస్‌ రోడ్‌ ప్రాంతంలో పర్యటించారు. కవాతు సందర్భంగా బందోబస్తు ఎలా ఉండాలనే దానిపై శనివారం పోలీసు ఉన్నతాధికారులు సమావేశమై చర్చించారు. 10 వేలమందికి పైగా సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. గణేష్‌ నిమజ్జనం నేపధ్యంలో నెక్లెస్‌రోడ్డు, ట్యాంకు బండ్‌ వద్ద పోలీసు బందోబస్తు ఉంది కవాతు బందోబస్తుకు వారి స్థానంలో కొత్తవారు విధుల్లోకి రానున్నారు. గణేష్‌ నిమజ్జనం కోసం విధించిన ట్రాఫిక్‌ ఆంక్షలు ఆదివారం కూడా కొనసాగించాలని నిర్ణయించారు.