‘తెలంగాణ కొలవెరీ’ పాట చిత్రీకరణ

కరీంనగర్‌, జూలై 20 (జనంసాక్షి): తెలంగాణ బిడ్డలు ఆత్మహత్యలు చేసుకోకుండా, తెగించి కొట్లాడాలన్న సందేశాన్నిస్తూ ఓ పాటల ఆల్బం రూపుదిద్దుకుంటోంది. ఈ ఆల్బంలోని ఐదవ పాట ‘తెలంగాణ కొలవెరీ’ అంటూ సాగే పాటను శనివా రం కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో హీరో ఆకెన భాస్కర్‌, డ్యాన్సర్లపై చిత్రీకరించారు. ఈ పాట చిత్రీకరణకు చిట్టిమల్ల శ్రీనివాస్‌ క్లాప్‌ కొట్టారు. ఈ ఆల్బంకు మిలీనియం శ్రీనివాస్‌ స్క్రీన్‌ ప్లే, కొరియోగ్రఫీ, దర్శకత్వం అందిస్తున్నారు. రచన, గానం ఓరుగంటి శేఖర్‌, సంగీతం జి.ఎల్‌.నాందేశ్‌, కెమెరా రమేశ్‌ బండారి అందిస్తుండగా ప్రొడక్షన్‌ మేనేజర్లుగా తిరుణహరి, సౌండ్స్‌ దైవాల వెంకటేశ్‌ వ్యవహరిస్తున్నారు. స్టిల్స్‌ను ప్రేమ్‌కుమార్‌ పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా ఆల్బమ్‌ నిర్మాత మధుసూదన్‌ మాట్లాడుతూ తెలంగాణ జిల్లాల్లో షూటింగ్‌ శరవేగంగా జరుగుతున్నదని తెలిపారు. ఈ నెల 28న వీడియో ప్రోమోను విడుదల చేస్తామన్నారు. డైరెక్టర్‌ మిలీనియం శ్రీనివాస్‌ మాట్లాడుతూ తెలంగాణ సాధన కోసం యువత ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని, వీటిని నివారించడానికి తమ వంతు ప్రయత్నం చేద్దామన్న సదుద్దేశంతో ఈ ఆల్బంకు రూపకల్పన చేశామని తెలిపారు. పాట చిత్రీకరణలో హీరో భాస్కర్‌తోపాటు డ్యాన్సర్లు ఆకాశ్‌, గణేశ్‌, అరుణ్‌, రాజు, ఝాన్సీ, స్రవంతి, సాంకేతిక వర్గం పాల్గొన్నారు.