ఇందుగులలో యథేచ్ఛగా నల్లమట్టి అక్రమ తరలింపు

పోలీస్ స్టేషన్ ఎదురు నుంచే వెళ్తున్న భారీ టిప్పర్లు
పట్టించుకోని రెవెన్యూ, మైనింగ్, పోలీస్ శాఖలు
అధికారుల తీరుపై వ్యక్తమవుతున్న తీవ్ర అనుమానాలు
మాడుగులపల్లి జూలై 23 (జనం సాక్షి): మాడుగులపల్లి మండలం ఇందుగుల గ్రామంలో నల్లమట్టి అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది నిబంధనలకు విరుద్ధంగా కొందరు అక్రమార్కులు రాత్రి, పగలు తేడా లేకుండా భారీ టిప్పర్లలో నల్లమట్టిని తోడేస్తూ రూ.లక్షలు ఆర్జిస్తున్నారు అధికారుల కళ్లముందే ఈ దందా సాగుతున్నా, తమకేమీ పట్టనట్లు వ్యవహరించడంపై స్థానికుల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి
ఠాణా ఎదురుగానే రవాణా.. అయినా నో రెస్పాన్స్: మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా నుంచే ప్రతిరోజూ పదుల సంఖ్యలో నల్లమట్టి టిప్పర్లు రాకపోకలు సాగిస్తున్నాయి అయినా ఏ ఒక్క అధికారి కూడా వీటిని అడ్డుకున్న దాఖలాలు లేవు మైనింగ్ అనుమతులు (పర్మిట్లు) లేకుండా, ప్రభుత్వ ఖజానాకు రావలసిన రోయల్టీకి భారీగా గండి కొడుతూ ఈ దందా నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి అధికారుల మామూళ్ల మత్తు వల్లే ఈ అక్రమ రవాణాకు అడ్డూ అదుపూ లేకుండా పోయిందని స్థానికులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు
ధ్వంసమవుతున్న రోడ్లు – భయంలో ప్రజలు: పరిమితికి మించి (ఓవర్‌లోడ్) నల్లమట్టితో వెళ్తున్న భారీ వాహనాల ధాటికి ఇందుగుల గ్రామంతో పాటు మండలంలోని రహదారులు పూర్తిగా ధ్వంసమవుతున్నాయి టిప్పర్ల అతివేగం, ధూళి వల్ల నిత్యం ప్రయాణికులు, గ్రామస్తులు నరకం చూస్తున్నారుఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ఆందోళన చెందుతున్నారు
కలెక్టర్, ఎస్పీ స్పందించాలి: ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SP) తక్షణమే జోక్యం చేసుకుని ఇందుగులలో సాగుతున్న నల్లమట్టి అక్రమ తరలింపును అడ్డుకోవాలని స్థానికులు కోరుతున్నారు అక్రమ దందాకు సహకరిస్తున్న అధికారులపై, వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.



