అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి వివేక్

జనసంద్రంగా మారిన హౌసింగ్ బోర్డు కాలనీ

– అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెట్టాలని మంత్రి పిలుపు

చుంచుపల్లి, జూలై 12(జనం సాక్షి)

చుంచుపల్లి మండలం నందా తండా గ్రామపంచాయతీ పరిధిలోని హౌసింగ్ బోర్డు కాలనీలో భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ నూతన విగ్రహాన్ని తెలంగాణ కార్మిక, ఉపాధి కల్పన, పరిశ్రమలు, గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి ఆదివారం అంగరంగ వైభవంగా ఆవిష్కరించారు. వేలాది మంది ప్రజల హర్షధ్వానాల మధ్య జరిగిన ఈ కార్యక్రమం హౌసింగ్ బోర్డు కాలనీ చరిత్రలో చిరస్మరణీయ ఘట్టంగా నిలిచింది.విగ్రహావిష్కరణకు ముందుగా మంత్రి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం భారీ ర్యాలీ, డప్పు వాయిద్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, జై భీమ్ నినాదాలతో హౌసింగ్ బోర్డు సెంటర్ మారుమోగింది. కాలనీ పరిసర ప్రాంతాల నుంచి వేలాదిగా ప్రజలు, యువత, మహిళలు, విద్యార్థులు, సామాజిక సంఘాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే రాజ్యాంగాన్ని రూపొందించి ప్రతి భారతీయుడికి సమాన హక్కులు, సామాజిక న్యాయం, స్వేచ్ఛ, సమాన అవకాశాలు కల్పించారని కొనియాడారు. రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ గౌరవించి, అంబేద్కర్ ఆశయాలను నిత్యజీవితంలో ఆచరణలో పెట్టినప్పుడే సమానత్వ సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. విద్య, ఐక్యత, చైతన్యంతోనే సమాజ అభివృద్ధి సాధ్యమని యువతకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి మాట్లాడుతూ, డాక్టర్ అంబేద్కర్ చూపిన మార్గంలో నడవడం ప్రతి భారతీయుడి బాధ్యత అని పేర్కొన్నారు. సామాజిక న్యాయం, రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె సూచించారు.హౌసింగ్ బోర్డు అంబేద్కర్ విగ్రహ స్థాపన కమిటీ సభ్యులు మాట్లాడుతూ, స్థానిక ప్రజల సహకారం, దాతల ఉదార విరాళాలు, యువత అంకితభావంతో ఈ విగ్రహాన్ని నిర్మించినట్లు తెలిపారు. భావితరాలకు అంబేద్కర్ ఆశయాలను చేరవేయడం, రాజ్యాంగ విలువలపై అవగాహన పెంపొందించడమే ఈ విగ్రహ ప్రతిష్ఠాపన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.కార్యక్రమాన్ని విజయవంతం చేసిన హౌసింగ్ బోర్డు కాలనీ ప్రజలు, దాతలు, యువత, మహిళలు, సామాజిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలందరికీ విగ్రహ స్థాపన కమిటీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది.
ఈ కార్యక్రమంలో హౌసింగ్ బోర్డు అంబేద్కర్ విగ్రహ స్థాపన కమిటీ అధ్యక్షుడు తుంపూరి శివ, కార్యదర్శి తాండ్ర వెంకటేశ్వర్లు, సభ్యులు శనగ వెంకటేశ్వర్లు, గొనె శ్రీకాంత్, గుర్రం లక్ష్మణ్, గడ్డం రగన్ బాబు, శనగ స్వామి, జిల్లా టీం కన్వీనర్ దాసరి రమేష్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంతోటి పాల్, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కే. షాబీర్ పాషా, కొత్తగూడెం మేయర్ మూడు గణేష్, విద్యానగర్ ఉపసర్పంచ్ వాసిరెడ్డి మురళి, నందా తండా సర్పంచ్ మాలోత్ బలరాం, చుంచుపల్లి సర్పంచ్ వీరన్న, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంఘాల ప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, యువజన, మహిళా సంఘాల సభ్యులు తదితరులు భారీ సంఖ్యలో మరియు ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన పోలీస్ సిబ్బందికి గ్రామ ప్రజలు ధన్యవాదాలు తెలిపారు.

తాజావార్తలు