తెలంగాణ కోసం కలిసి కలబడుదాం : కేకే

హైదరాబాద్‌, ఆగస్టు 5 (జనంసాక్షి) : తెలంగాణ కోసం కలిసి కలబడుదామని పీసీసీ మాజీ చీఫ్‌ కె.కేశవరావు పిలుపు నిచ్చారు. ఆదివారం స్థానిక జయా గార్డెన్‌లో జరిగిన టీఎన్జీవోల మాజీ అధ్యక్షుడు స్వామిగౌడ్‌ గౌరవార్థం నిర్వహించిన సమావేశంలో కెకె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ కోరుకునే వారంతా ఐక్యంగా ఉంటూ తమ బలాన్ని చాటాలని అన్నారు. తెలంగాణను వ్యతిరేకించే వారిని తెలంగాణ కోసంఒప్పించాలని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగసంఘాలు పోరాట పటిమను చూపాయని ఆయన కొనియాడారు. త్వరలోనే తెలంగాణ రాష్ట్రం వస్తుందన్న ఆశాభావాన్ని కె.కె వ్యక్తం చేశారు. తెలంగాణపై తనకు సంకేతాలు ఉన్నాయని చెప్పారు. కొంతకాలం శాంతియుతంగా ఉంటే తెలంగాణ ఇవ్వడం సులభమవుతుందని చెప్పారని, అందుకే సైలెంట్‌గా ఉన్నట్లు చెప్పారు. ఇవ్వని పక్షంలో ఉద్యమం మరోమారు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల వరకు వేచి చూస్తామని చెప్పారు. ఆరునూరైనా తెలంగాణ సాధించి ఆచార్య జయశంకర్‌ను నివాళి ఆర్పిస్తామన్నారు. కెసిఆర్‌ జిల్లాలోని కంఠేశ్వర్‌లో జయశంకర్‌ విగ్రహాన్ని కెకె ఆవిష్కరించారు.