తెలంగాణ గడ్డపై పుట్టడమే వారు చేసిన నేరమా ?

సీమాంధ్రకు అదనపు మెడికల్‌ సీట్లు ..తెలంగాణకు మొండి చేయి
ఇంతకంటే వివక్షకు ఆధారమేం కావాలి : హరీష్‌
హదరాబాద్‌ , జూలై 3 (జనంసాక్షి):
మెడికల్‌ సీట్ల విషయంలో తెలంగాణ విద్యార్థుల పట్ల వివక్షత చూపుతున్నారని టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు ధ్వజమెత్తారు. ర్యాంకర్లు తెలంగాణ ప్రాంతంలో పుట్టడమే నేరమా అని ప్రశ్నించారు. మంగళవారంనాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది తెలంగాణలోని మెడికల్‌ కళాశాలల్లో ఒక్క సీటు కూడా పెంచకపోవడం దారుణ మన్నారు. విశాఖపట్నం, అనంతపురం, విజయవాడల్లోని మెడికల్‌ కళాశాలల్లోని సీట్లను పెంచారన్నారు. తెలంగాణ ప్రాంత విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించినప్పటికీ వారికి ఆశించిన స్థాయిలో ప్రయోజనం చేకూరడం లేదన్నారు. తెలంగాణలో ఒపెన్‌ కేటగిరీలో అమ్మాయికి వెయ్యి ర్యాంకు వచ్చినా ప్రభుత్వ కళాశాలలో సీటు రాదన్నారు. అదే సీమాంధ్ర ప్రాంతంలోని అమ్మాయికి 1500 ర్యాంకు వచ్చినా ప్రభుత్వ కళాశాలలో సీటు దక్కుతుందన్నారు. ఇది ప్రభుత్వ వివక్షతకు నిదర్శనమన్నారు. కష్టపడి చదివి మంచి ర్యాంకు తెచ్చుకోవడం తెలంగాణ ప్రాంత విద్యార్థుల నేరమా అని ప్రశ్నించారు. మంచి ర్యాంకులు తెచ్చుకునే వారు తెలంగాణలో పుట్టడం వారు చేసుకున్న నేరమా అని నిలదీశారు. ఇప్పటికైనా మంచిర్యాంకులు సాధించిన తెలంగాణ విద్యార్థుల పట్ల ప్రభుత్వం స్పందించాలని కోరారు.