దళితబంధుతో కాంగ్రెస్ గుండెల్లో రైళ్లు
హుజూరాబాద్,అగస్టు16(జనంసాక్షి): దళిత బంధు పథకం కాంగ్రెస్ శ్రేణుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. అద్భుతమైన పథకానికి సీఎం కేసీఆర్ అంకురార్పణ చేస్తుండటంతో.. తమ పునాదులు కదిలిపోతున్నాయని ఉలిక్కిపడుతున్నారు. ఎలాగైనా దళిత బంధు పథకాన్ని ఆపాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ నాయకులు కుట్రలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
దళిత బంధు పథకం ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెళ్తున్న దళితులను కాంగ్రెస్ నాయకులు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. వీణవంక మండల కేంద్రం నుంచి దళితులతో బయల్దేరిన బస్సుకు కాంగ్రెస్ శ్రేణులు అడ్డుగా వెళ్లారు. ఆ బస్సును ముందుకు కదలనివ్వకుండా అడ్డుకున్నారు. దళిత బంధుపై కాంగ్రెస్ నాయకులు అక్కసు వెళ్లగక్కుతూ.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని స్థానిక టిఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. ఈ పథకాన్ని అడ్డుకునే వారంతా దళిత ద్రోహులేనని దళితులు మండిపడ్డారు. నోటికాడి ముద్దను గుంజుకునే కుట్రలకు పాల్పడుతున్న దళితద్రోహులను వదిలిపెట్టబోమని, అలాంటివారికి రాజకీయంగా బుద్ధిచెప్తామని వారు హెచ్చరించారు.